కూతురి కోసం.. 30 ఏళ్ల పాటు మగాడి వేషంలో మహిళ..!

ఓ స్త్రీ పురుషుడిగా జీవించడం చాలా కష్టం.. కానీ ఓ మహిళ మాత్రం తన కూతురి కోసం 30 ఏళ్ల పాటు పురుషుడుగా మారింది. భర్త చనిపోయాక కూతురిని పెంచడం కోసం మగాడి అవతారం ఎత్తి జీవిస్తోంది.. వివరాల మేరకు.. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాకు చెందిన పెంచియమ్మల్ అనే మహిళ పెళ్లయిన 15 రోజులకే భర్తను కోల్పోయింది. 

ఆ తర్వాత ఆమె షణ్ముగ సుందరి అనే ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే పెంచియమ్మాళ్ మళ్లీ పెళ్లి చేసుకోలేదు. కూతురును పెంచడం కోసం పనికి వెళ్లింది. భవన నిర్మాణ స్థలాలు, హోటళ్లు మరియు టీ షాపుల్లో పనిచేసేది. ఒంటరి మహిళ, పైగా వయసులో ఉండటంతో పనిచేసే ప్రాంతాల్లో ఆమెకు వేధింపులు ఎదురయ్యాయి.

ఈ వేధింపులు తప్పించుకోవడంతో పాటు బిడ్డను బాగా పెంచాలని అనుకుంది. అందుకోసం జుట్టు కత్తిరించి, చొక్కా మరియు లుంగీ కట్టి మగాడిలా మారింది. తన పేరును ముత్తుగా మార్చుకుంది. అలా 30 ఏళ్లుగా పెయింటర్, వంట మాస్టర్ వంటి పనులు చేసింది. తన కూతురు పెంచి పెద్ద చేసింది. 

ఊళ్లో అందరూ తండ్రీ కూతుళ్లు జీవిస్తున్నారని అనుకునేవారు. దీంతో వారికి ఎలాంటి సమస్యలు రాలేదు. కూతురుకు పెళ్లి చేసి అత్తారింటికి పంపింది. పెంచియమ్మాళ్ల వయసు ఇప్పుడు 57 ఏళ్లు.. వయసు మీద పడటంతో మునుపటిలా పనిచేయలేకపోతుంది. దీంతో వితంతువు పెన్షన్ కోసం అసలు అవతారాన్ని బయటపెట్టింది. 

అయితే పెంచియమ్మాళ్ కి ఓ సమస్య వచ్చింది. ఆమె ఆధార్ కార్డు ముత్తు పేరుతోనే ఉంది. ఆమె వద్ద భర్త డెత్ సర్టిఫికెట్ కూడా లేదు. దీంతో ఆమెకు వితంతు పింఛన్ ఇవ్వడం ప్రభుత్వానికి సమస్యగా మారింది. అయితే తాను ఎప్పటికీ పురుషుడిగానే ఉంటానని, చినిపోయాక అందరూ ముత్తుగానే గుర్తు చేసుకోవాలని పెంచియమ్మాళ్ కోరింది.       

 

 

Leave a Comment