‘యామిని’.. మరో ‘మయూరి’..ఓ కాలు లేకున్నా ఆత్మవిశ్వాసంతో..!

మీకు ‘మయూరి’ సినిమా గుర్తుంది కదూ.. ఆ సినిమాలో నటించిన సుధాచంద్రన్ యాక్సిడెంట్ లో కాలు పోగొట్టుకొని.. కృత్రిమ కాలు పెట్టుకొని ఎన్నో నాట్య ప్రదర్శనలు ఇచ్చింది. నాట్యంలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నారు సుధాచంద్రన్.. అదేవిధంగా యామినికి ఒక కాలు లేదు. అయినా ప్లాస్టిక్ కాలుతోనే నాట్యం నేర్చుకుని ప్రదర్శనలు చేస్తూ.. మరో మయూరిగా నిలిచింది. బాల్యంలో జరిగిన ఓ ప్రమాదం తన జీవితంలో చీకటి మిగిల్చినా.. ఇప్పుడు వెలుగులు నింపుకుంటూ అడుగులు వేస్తోంది.. 

విశాఖపట్నానికి చెందిన యామినిది పేద కుటుంబం.. రెండేళ్ల వయస్సులో పుట్టినరోజు వేడుక జరుపుకునేందుకు అమ్మమ్మ గారి ఇంటికి వెళ్తున్న సమయంలో బస్సు ప్రమాదం జరిగి యామిని కాలు తీసేశారు. అయితే యామిని కాలుకు ఇన్ఫెక్షన్ రాకుండా తల్లిదండ్రులు శస్త్రచికిత్సలు చేయించారు. యామిని కుటుంబ పరిస్థితి తెలిసి విజయనగరానికి చెందిన గురుదేవా ట్రస్టు సభ్యులు ఆమెకు కృత్రిమ కాలు పెట్టించారు. ఆమె పెరుగుదలకు అనుగుణంగా ప్రతిఏడా ఆ కాలును మారుస్తున్నారు. ప్రస్తుతం యామిని ఏడో తరగతి చదువుతోంది.. 

చదువులో ఎప్పుడు క్లాస్ ఫస్ట్ వచ్చే యామినికి డ్యాన్స్ నేర్చుకోవాలన్న కోరిక కలిగింది. ఈ విషయాన్ని తన తల్లికి చెప్పింది. కూతురి మనుసు అర్థం చేసుకున్ తల్లిదండ్రులు పిల్లలను తీసుకొని రాజమండ్రికి వచ్చారు. యామినిని రెండేళ్ల క్రితం ఓ డ్యాన్స్ ఇన్ స్టిట్యూట్ లో చేర్పించారు. యామినిలో డ్యాన్స్ చేయాలన్న ఆసక్తిని మధు అనే డ్యాన్స్ మాస్టర్ గ్రహించారు. ఆమెపై ప్రత్యేక శ్రద్ధపెట్టి డ్యాన్స్ నేర్పించారు. 

డ్యాన్స్ మాస్టర్ సహకారంతో ప్రత్యేక వేదికలపై ప్రదర్శనలు చేసింది. రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం పట్టణాల్లో ఇచ్చిన 12 ప్రదర్శనల్లో మూడు అవార్డులు గెలుచుకుంది. సినీ కొరియోగ్రాఫర్లు శేఖర్ మాస్టర్, అమిత్, సాయితేజ, రాజు వంటి వారి ప్రశంసలు అందుకుంది యామిని.. భవిష్యత్తులో డాక్టర్ కావాలని ఉందని, దాని కోసం కష్టపడి చదువుతానని యామిని చెబుతోంది. జీవితంలో డ్యాన్స్ ని మాత్రం వదలనని చెప్పింది. యామిని జీవితంలో ముందుకు వెళ్లాలని ఆశిద్దాం.. జీవితంలో ఓడిపోయిన వారు నిరుత్సాహపడకుండా యామినిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు వెళ్లాలని కోరుకుందాం..  

Leave a Comment