మౌనం వీడండి మోడీజీ.. ఐఐఎం విద్యార్థుల బహిరంగ లేఖ..!

దేశంలో జరుగుతున్న విద్వేష ప్రసంగాలపై, కుల, మత ప్రాతిపదికన హింససై మౌనం వీడాలని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)కి చెందిన విద్యార్థులు, అధ్యాపకులు ప్రధాని మోడీకి బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖపై ఐఐఎం అహ్మదాబాద్, ఐఐఎం బెంగళూరుకు చెందిన 183 మంది విద్యార్థులు, ఫ్యాకల్టీ సభ్యులు సంతకాలు చేశారు. 

విద్వేష ప్రసంగాలు, హింసను రెచ్చగొట్టే పోకడలపై ప్రధాని మౌనం వీడాలని అభ్యర్థించారు. ప్రధాని మౌనం ద్వేషపూరిత స్వరాలకు ఎంతో ధైర్యాన్నిస్తుందని లేఖలో పేర్కొన్నారు. దేశ ఐక్యత, సమగ్రతకు ముప్పు కలిగిస్తోందని, విభజన శక్తులకు వ్యతిరేకంగా ప్రధాని బలంగా నిలబడాలని కోరారు. ప్రస్తుతం దేశంలో భయానక వాతావరణ నెలకొందని పేర్కొన్నారు. 

ఇటీవల హరిద్వార్ లో జరిగిన ధర్మ సంసద్ సమావేశంలో ముస్లింలను మూకుమ్మడిగా హత్య చేయాలని, వారికి వ్యతిరేకంగా ఆయుధాలు చేపట్టాలని బహిరంగంగానే పిలుపునిస్తున్నారని, మతం కులం ప్రాతిపదికన ప్రజలపై దాడులకు రెచ్చగొట్టడం ఆమోదయోగ్యం కాదని ఐఐఎం విద్యార్థులు లేఖలో పేర్కొన్నారు. 

ఇటీవల చర్చిలతో సహా పలు ఆరాధన స్థలాలపై దాడులు జరుగుతున్నాయని, శిక్షలు పడతాయని తెలిసినా వారు వెనక్కి తగ్గడం లేదని లేఖలో పేర్కొన్నారు. ఎవరికి ఇష్టం వచ్చిన మతాన్ని వారు స్వేచ్ఛగా అనుసరించే హక్కు రాజ్యాంగం ప్రజలకు కల్పించిందని, ప్రస్తుతం ప్రజల్లో దీనిపై తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని ఐఐఎం విద్యార్థులు పేర్కొన్నారు.    

 

Leave a Comment