రిటైర్డ్ డబ్బులు రూ.40 లక్షలు.. పేద విద్యార్థుల కోసం ఇచ్చేసిన ఉపాధ్యాయుడు..!

మధ్యప్రదేశ్ లో ఓ ఉపాధ్యాయుడు గొప్ప మనసు చాటుకున్నాడు. రిటైర్మెంట్ వచ్చిన తర్వాత వచ్చిన డబ్బులను పేద విద్యార్థుల కోసం ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆయనే విజయ్ కుమార్ చాన్సోరియా.. రాష్ట్రంలోని పన్నా జిల్లా ఖందియాలో చాన్సోరియా ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేశారు. 

39 సంవత్సరాలు సర్వీస్ చేసిన ఆయన రిటైర్డ్ అయ్యారు. దీంతో ఆయనకు సోమవారం సన్మానం జరిగింది. ఈ సన్మాన కార్యక్రమంలో చాన్సోరియా రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్, సేవింగ్స్ ద్వారా వచ్చిన 40 లక్షల రూపాయలను పేద విద్యార్థుల కోసం ఇస్తున్నట్లు ప్రకటించారు.. 

టీచర్ గా ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దానని, అయితే అది తనకు సంతృప్తి ఇవ్వలేదని అన్నారు. వారి కోసం ఇంక ఏదో చేయాలని అనుకున్నానని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని చాన్సోరియా చెప్పారు. తాను రిక్షా తొక్కి, పాలు అమ్మి ఎంతో కష్టపడి చదువుకున్నానని, చదువంటే ఇష్టమున్న పేద విద్యార్థులకు ఇలాంటి కష్టం రాకూడదని ఆ డబ్బులు ఇస్తున్నట్లు చెప్పారు. చాన్సోరియాకి భార్య, కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కూతురికి పెళ్లయిపోయింది. ఇద్దరు కుమారులు ఉద్యోగాలు చేసుకుంటూ బాగానే స్థిరపడ్డారు. వారి అనుమతితోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చాన్సోరియా పేర్కొన్నారు.. 

Leave a Comment