అబ్బాయి నచ్చితే సహజీవనం.. పిల్లలు పుట్టాకే పెళ్లి.. అక్కడ వింత ఆచారం..!

పెళ్లి తర్వాతే కాపురం, పిల్లల్ని కనడం మన సంప్రదాయం.. పొరపాటున పెళ్లికి ముందే గర్భం దాల్చితే మాత్రం.. అమ్మాయిపై అనేక నిందలు వేస్తుంది మన సమాజం.. కానీ ఇక్కడ ఒక తెగ మాత్రం అందుకూ పూర్తి వ్యతిరేకం.. పెళ్లికి ముందే నచ్చిన వారితో సహజీవనం చేయొచ్చు. అంతేకాదు పిల్లల్ని కూడా కనవచ్చు. నచ్చితే పెళ్లి కూడా చేసుకోవచ్చు. దీని గురించి అక్కడ ఎవరూ ప్రశ్నించరు. 

ఇదెక్కడో వేరే దేశంలో కాదండోయ్.. మన దేశంలోనే.. ఆ తెగ పేరు ‘గరాసియా తెగ’. రాజస్తాన్, గుజరాత్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ తెగ విస్తరించి ఉంది. వీరి సంప్రదాయం ప్రకారం.. యుక్త వయసులోకి వచ్చిన అమ్మాయిలు.. తమకు నచ్చిన అబ్బాయిని ఎంచుకోవచ్చు. అందుకు నిర్ణీత సమయం ఉంటుంది. అందుకోసం రెండు రోజుల పాటు ప్రత్యేకంగా ఓ జాతరను కూడా నిర్వహిస్తారు.  

అక్కడ అమ్మాయి తమకు నచ్చిన అబ్బాయిని ఎంచుకొని.. వారితో సహజీవనం చేయవచ్చు. ఈక్రమంలో వీరు పిల్లల్ని కూడా కనవచ్చు. ఆ తర్వాత ఆర్థికంగా స్థిరపడి.. ఏ లోటూ లేకుండా కుటుంబాన్ని పోషించగలమన్న ధీమా వచ్చాకే పెళ్లి చేసుకోవచ్చు. ఈ పద్ధతిని వారు ‘దాపా’గా పిలుస్తారు.

అంతేకాదు అమ్మాయికి నచ్చిన అబ్బాయి కుటుంబ సభ్యులు.. అమ్మాయి కుటుంబానికి కొంత సొమ్మును అందించాలి. భవిష్యత్తులో పెళ్లి చేసుకోవాలన్నా.. పెళ్లి సమయంలో ఖర్చు మొత్తం అబ్బాయి కుటుంబానికి చెందిన వారే భరించాలి. సహజీవనం సమయంలో అబ్బాయి వేధించినా.. అతడితో కొనసాగలేమని నిర్ణయించుకుంటే.. ఆ బంధం నుంచి బయటకు రావచ్చు. ఆ ఆచారాలన్నీ గరాసియా తెగ వారు కొన్ని శతాబ్దాలుగా పాటిస్తున్నాయి. ఈ ఆచారాలే కాలక్రమేణా వరకట్న వేధింపులు, మరణాలు, అమ్మాయిలపై అత్యాచారాలు వంటి ఎన్నో తగ్గించాయని ఆ తెగవారు చెబుతున్నారు.    

Leave a Comment