సెలూన్ లో గ్రంథాలయం.. ఈ క్షరకుడి ఆలోచనకు ప్రధాని మోడీ ప్రశంస..!

సాధారణంగా కస్టమర్ల కోసం సెలూన్ లో టీవీ పెట్టి ఉంచడం లేదా న్యూస్ పేపర్లు వంటివి పెట్టడం చూసి ఉంటాం.. కానీ తమిళనాడుకు చెందిన ఓ బార్బర్ ఇందుకు భిన్నంగా ఆలోచించాడు. తన సెలూన్ లో టీవీకి బదులుగా ఒక గ్రంథాలయాన్ని పెట్టాడు. తన దగ్గరికి వచ్చిన కస్టమర్లు పుస్తకాలు చదివేలా ఏర్పాటు చేశాడు. అంతే కాదు.. ఒక పుస్తకం పూర్తిగా చదివితే బిల్లులో 30 శాతం డిస్కౌంట్ కూడా ఇస్తాడు. పుస్తకాలు చదివే అలవాటు తగ్గిపోతున్న ప్రస్తుత తరుణంలో ఇలాంటి గొప్ప ఆలోచన చేయడంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మన్ కీ బాత్ ద్వారా ప్రశంసలు పొందాడు. 

తమిళనాడులోని తూత్తుకూడికి చెందిన పోన్ మారియప్పన్ 8వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. మారియప్పన్ ఓ న్యాయవాది వద్ద గుమస్తాగా పనిచేశాడు. న్యాయవాది తెలిపిన మాటలతో విద్య ప్రాముఖ్యత తెలుసుకున్నాడు. తాను చదువుకోలేకపోయినందుకు బాధపడ్డాడు. ఈ నేపథ్యంలో తమ కుల వృత్తితో ఆ ప్రాంతంలో సెలూన్ దుకాణాన్ని ప్రారంభించాడు. 

సెలూన్ లో కస్టమర్ల కాలక్షేపం కోసం ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాడు. అలాగే దుకాణానికి వచ్చిన వారు ఏ పుస్తకాన్ని చదివారు? ఉపయోగకరంగా ఉందా? అంటూ తెలుసుకోవడంతో వారి అభిప్రాయాలను ఓ పుస్తకంలో నమోదు చేస్తున్నాడు. అంతే కాదు దుకాణంలో రాజకీయ నేతల ఫొటోలు లేకుండా మహాత్మాగాంధీ, తిరువళ్లువర్, అబ్దుల్ కలాం, వివేకానంద, మహాకవి భారతి చిత్రపటాలను ఏర్పాటు చేశాడు. 

 ప్రధాని మోడీ ప్రశంసలు..

 ఈ ఆదివారం నిర్వహించిన ప్రధాని మోడీ ‘మన్ కీ బాత్’ లో మారియప్పన్ ను ప్రధాని మోడీ పలకరించారు. మారియప్పన్ కు ఫోన్ చేసి క్షేమ సమాచారాలు తమిళ్ లో అడిగి తెలుసుకున్నారు. మీకు లైబ్రరీ ఏర్పాటు చేయాలని ఆలోచన ఎలా వచ్చిందని, ఏ పుస్తకం అంటే ఎక్కువ ఇష్టమని ప్రధాని మోడీ అడిగారు. లైబ్రరీ ఏర్పాటు చేసి పుస్తక పఠనాన్నిప్రోత్సహిస్తుంనందుకు ప్రశంసించారు. ఏకంగా ప్రధాని మోడీ తనతో సంభాషించినందుకు మారియప్పన్ సంతోషానికి హద్దులు లేవు… 

Leave a Comment