Inspiring Story : అత్తింటి వేధింపులతో ఆత్మహత్య చేసుకోవాలనుకుంది.. కష్టాలను ఎదుర్కొని పోలీస్ ఆఫీసర్ గా మారిన మహిళ..!

సమాజంలో అన్ని మారుతున్నాయి. ఒక్క మహిళల పట్ల మన ఆలోచన ధోరణి తప్ప. సమాజంలో మహిళలు ఆత్మగౌరవంతో, స్వశక్తితో తమ ఆర్థిక అవసరాలను తీర్చుకుంటూ అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. అయితే అత్తింటి వేధింపులకు మాత్రం ఎంతటి వారైనా బలి అవుతున్నారు. ఎన్నో కలలతో వైవాహిక జీవితంలో అడుగుపెట్టిన వారికి అత్తింటి వేధింపులు స్వాగతం పలుకుతున్నాయి. వేధింపులు తట్టుకోలేక కొంత మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరికొంత మంది మాత్రం తామేమో నిరూపించుకుంటున్నారు.. అలా అత్తింటి కష్టాలను ఎదురించి పోలీస్ ఆఫీసర్ గా ఎదిగిన ఓ మహిళ గురించి తెలుసుకుందాం.. 

ఆమె కేరళ రాష్ట్రం కోళికోద్ కు చెందిన నౌజిషా.. 2013లో ఓ వ్యక్తితో ఆమెకు పెళ్లయింది. పెళ్లయినప్పటి నుంచి అత్తింట్లో ఎప్పుడూ వేధింపులే.. అత్తింట్లో ఆమెకు ఆదరణ దక్కలేదు. తర్వాత కొన్ని రోజులకు కొడుకు పుట్టాడు. ఇప్పుడు అన్ని సర్దుకుంటాయిలే అని భావించిన నౌజిషాకు నిరాశే ఎదురైంది. అత్తవారింట్లో వేధింపులు తగ్గలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఆత్మహత్య చేసుకోవాలని భావించింది. అయితే ఆ క్షణంలో తన కొడుకు, తనను ఎంతో ప్రేమగా పెంచిన తల్లిదండ్రులు గుర్తుకొచ్చారు. దీంతో ఆత్మహత్య నిర్ణయం మార్చుకుంది. 2016లో తన కొడుకును తీసుకొని పుట్టింటికి వచ్చింది. తన భర్తకు విడాకుల నోటీసు పంపంచింది.  

పెళ్లి చేసుకునే సమయానికి నౌజిషా బీఎస్సీ, ఎంఎస్సీ కంప్యూటర్స్ చేసి ఉంది. ఓ ఏడాది పాటు కాలేజీలో గెస్ట్ లెక్చరర్ గా కూడా చేసింది. దీంతో పుట్టింటి వారిమీద ఆధారపడకుండా వెంటనే కాలేజీలో లెక్చరర్ గా చేరింది. ఉదయం ఉద్యోగం చేస్తూ సాయంత్రం కేపీఎస్సీ కోచింగ్ తీసుకుంది. 2018లో తొలి ప్రయత్నంలో రాత పరీక్షలో పాస్ అయింది. అయితే అప్పుడు ఫిజికల్ టెస్ట్ కు హాజరుకాలేకపోయింది. దీంతో మళ్లీ 2020లో పరీక్షలు రాసింది. విజయం సాధించి ఈ ఏడాది ఏప్రిల్ లో ట్రైనీ పోలీస్ ఆఫీసర్ గా విధుల్లో చేరింది. మహిళలు వేధింపులను మౌనంగా భరించవద్దని, నోరు తెరవాలని నౌజిషా అంటున్నారు. వేధింపులకు గురవుతున్న మహిళలు మిత్ర హెల్ప్ లైన్ కు ఫోన్ చేయాలని ధైర్యం చెబుతున్నారు. తనను ఆదర్శంగా తీసుకుని ధైర్యంగా జీవించాలని సూచిస్తున్నారు నౌజిషా.. 

Leave a Comment