పేద పిల్లలను చదివిస్తున్న కాకినాడ యువకుడు..!

అతడు ఒక నిరుపేద కుటుంబానికి చెందిన యువకుడు. చదువుకున్నది పదో తరగతి మాత్రమే.. ఇప్పుడు 26 మందిని చదివిస్తున్నాడు కాకినాడ యువకుడు బి.సతీష్.. కోవిడ్ వల్ల తల్లి లేక తండ్రిని కోల్పోయిన పిల్లలకు అండగా ఉంటున్నాడు. తన మిత్రులతో కలిసి శ్రీ యువసేన అనే సేవా సంస్థను ప్రారంభించి ఎందరికో తోడ్పాటు అందిస్తున్నారు.. 

కాకినాడ రాజాజీవిధికి చెందిన సతీష్ పదో తరగతి వరకు చదివి కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడంతో చదువు ఆపేశాడు. తర్వాత తన తండ్రి ఫ్రూట్స్ వ్యాపారంలో సాయం చేస్తున్నాడు. చదువుకునే రోజుల్లో సతీష్ కు స్వామి అనే ప్రాణ మిత్రుడు ఉండేవాడు. 2013లో స్వామి రోడ్డు ప్రమాదంలో మరణించాడు. స్వామి మరణం సతీష్ తో పాటు తన ఫ్రెండ్స్ ని కలిచివేసింది. స్నేహితుని గుర్తుగా సేవ కార్యక్రమాలు చేయాలనుకున్నారు. ఈనేపథ్యంలో శ్రీయువసేన పేరుతో సంస్థను ఏర్పటు చేశారు. తన స్నేహితులతో కలిసి ఆరేళ్లుగా పలు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

శ్రీయువసేన సంస్థ ద్వారా కరోనా వల్ల తల్లి లేదా తండ్రిని కోల్పోయిన పిల్లలను చదివిస్తున్నారు. అలా 26 మంది పిల్లలను చదివించే బాధ్యతను వీరు తీసుకున్నారు. పిల్లల విద్యకు రూ.5.84 లక్షలు ఖర్చు చేశారు. దేవుడు సతీష్ రూపంలో వచ్చి తమకు ఈ సహాయం చేస్తున్నాడని పిల్లల తల్లులు భావోద్వేగానికి గురవుతున్నారు. సతీష్ అతని స్నేహితులు చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే.. అలాంటి ఎన్నో సేవా కార్య్రమాలను శ్రీయువసేన సంస్థ చేస్తోంది. 

శ్రీయువసేన పేరుతో కాకినాడలో ఓ బ్లడ్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేశారు. ఎంతో మందికి రక్తదానం చేస్తున్నారు. అంతేకాదు విద్యార్థులకు నోట్ పుస్తకాలు, స్కూల్ బ్యాగ్స్ వంటివి పంపిణీ చేస్తున్నారు. కిడ్రీ రోగులు, ప్రాణాంతకమైన వ్యాధులతో బాధపడుతున్న పలువురికి ఆర్థిక సాయం, మందులు పంపిణీ చేస్తూ శ్రీయువసేన ఉదారతను చాటుకుంటుంది. తన వద్దకు కష్టం వచ్చిందని వస్తే.. తనతో సాధ్యం కాకపోతే ఎవరితో సాధ్యమవుతుందో వారి దృష్టికి తీసుకెళ్లి సహాయం చేయాలని కోరుతామని సతీష్ అంటున్నారు. మరీ శ్రీయువసేన చేస్తున్న సాయంపై మీరెంటారు ఫ్రేండ్స్..   

Leave a Comment