ఉక్రెయిన్-రష్యా యుద్ధం.. ఎంతో మంది ఆకలి తీరుస్తున్న ఇండియన్ రెస్టారెంట్..!

ఎవరికైనా.. ఎక్కడైనా.. ఆకలి ఒక్కటే.. సమయానికి తిండి లేకపోతే ఆకలి కేకలు వేయాల్సిందే.. ప్రస్తుతం ఉక్రెయిన్ లో ఇదేే పరిస్థితి ఏర్పడింది. కనీసం మంచి నీళ్లు కూడా దొరకని దుస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో కీవ్ లోని భారతీయ రెస్టారెంట్ ఎంతో మంది యుద్ధ బాధితుల ఆకలి తీరుస్తోంది.. గుజరాత్ కి చెందిన ‘సాథియా’ రెస్టారెంట్ నిర్వాహకుడు మనీష్ దవే భారత విద్యార్థులతో పాటు ఉక్రెయిన్ వాసులకు ఉచిత ఆహారం, షెల్టర్ కల్పిస్తూ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాడు.

కీవ్ నగరంలో మనీష్ దవే ‘సాథియా’ పేరుతో రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. అయితే కీవ్ నగరంపై రష్యా బాంబుల వర్షం కురిపిస్తోంది.. అప్పటి నుంచి రెస్టారెంట్ ని బాంబ్ షెల్టర్ గా మార్చేశారు మనీష్.. భారతీయ విద్యార్థులతో పాటు, ఉక్రెయిన్ వాసులకు షెల్టర్ కల్పించాడు. షెల్టర్ కల్పించడంతో పాటు ఆహారాన్ని కూడా ఉచితంగా అందిస్తున్నాడు. ఇప్పటి వరకు దాదాపు 120 మందికి షెల్టర్ కల్పించినట్లు మనీష్ తెలిపాడు.

గత రెండు, మూడు రోజులుగా కీవ్ లో పరిస్థితులు దారుణంగా మారిపోయాయి. దీంతో అవసరమున్న వారు తమ రెస్టారెంట్ కి రావాలని మనీష్ దవే సోషల్ మీడియాలో కోరుతున్నాడు. రెస్టారెంట్ కి వచ్చిన వారికి తమ వద్ద ఉన్న వనరులకు అనుగుణంగా ఉచితంగా ఆహారం అందించడంతో పాటు షెల్టర్ కల్పిస్తామని భరోసా ఇస్తున్నారు. ప్రస్తుతం తమ వద్ద 3-4 రోజులకు సరిపడా సరకులు ఉన్నాయని, కర్ఫ్యూ ఆంక్షలను సడలించిన వెంటనే సూపర్ మార్కెట్ల నుంచి సరిపడా సరకులు సేకరిస్తామని చెబుతున్నారు.  

 

Leave a Comment