ఆహారం వృథాలో రెండో స్థానంలో భారత్..!

ఎంతో మంది నిరుపేదలు పట్టెడన్నం కోసం రోజూ ఆకలి కేకలు వేస్తున్నారు. మెతుకు దొరక్క బతుకు బరువైన జీవితాలు ఎన్నో ఈ నేలపైనే కాలం వెళ్లదీస్తున్నాయి. పంట పండించే రైతు కూడా ఈ రోజు పస్తులుండే పరిస్థితులు వచ్చాయి.. ఒక వైపు ఇంత మంది తిండి దొరక్క అల్లాడుతుంటే.. మరోవైపు టన్నల కొద్దీ ఆహరం వృథా అయిపోయి నేలపాలవుతోంది..

ప్రపంచ వ్యాప్తంగా ఏటా 1,300 మిలియన్ టన్నుల ఆహరం వృథా అవుతోంది.. వాటిలో ఇంటి నుంచి 61 శాతం, హోటళ్ల నుంచి 26 శాతం, రిటైల్ ఆహార వ్యర్థాలు 13 శాతం ఉన్నాయి. భూమి మీద పండే పండ్లు, కూరగాయల్లో దాదాపు సగం మేర ఏదో ఒక రూపంలో వేస్ట్ అవుతూనే ఉన్నాయి. ఏటా ప్రపంచ వ్యాప్తంగా వేస్ట్ అవుతున్న ఆహారంలో కనీసం 25 శఆతం వినియోగించుకోగలిగినా సుమారు 87 కోట్ల మంది ఆకలి తీర్చవచ్చట..

ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం భారతదేశంలోనూ 68.7 మిలియన్ టన్నుల ఆహరం వృథా అవుతోంది.. ఆహరం వృథాలో ప్రపంచంలో భారత్ రెండో స్థానంలో ఉంది. కాగా..ఆహరం వృథాలో చైనా మొదటి స్థానంలో ఉంది. చైనాలో 91.6 మిలియన్ టన్నుల ఆహరం వృథా అయిపోతుంది. మూడో స్థానంలో యూఎస్ఏ(19.3 మిలియన్ టన్నులు), నాలుగో స్థానంలో జపాన్(8.1 మిలియన్ టన్నులు), ఐదో స్థానంలో జర్మనీ(6.2 మిలియన్ టన్నులు), ఆరో స్థానంలో ఫ్రాన్స్(5.5), ఏడో స్థానంలో యూకే(5.1), ఎనిమిదో స్థానంలో రష్యా(4.8), తొమ్మిదో స్థానంలో స్పెయిన్(3.6), పదో స్థానంలో ఆస్ట్రేలియా(2.5) ఉన్నాయి.

పేద దేశాల్లో వృథాకు కారణం:

అభివృద్ధి చెందుతున్న, పేద దేశాల్లో అయితే పంటలు పండించడం నుంచి రవాణా, మార్కెటింగ్, విక్రయం వరకు ఉన్న దశల్లో ఆహారం వృథా ఎక్కువగా ఉంటోంది. పంటలు పండించడం, నిల్వ, ఇతర అంశాల్లో సరైన సౌకర్యాలు, టెక్నాలజీ అందుబాటులో లేకపోవడంతో ఆహారం వృథా అవుతోంది.. 

ధనిక దేశాల్లో:

అభివృద్ధి చెందిన, ధనిక దేశాల్లో అయితే వండిన, తినడానికి సిద్ధంగా ఉన్న ఆహారం విషయంలో వృథా చాలా ఎక్కువ ఉంటుంది. వారు తమ సంపాదనలో ఆహారానికి ఖర్చు తక్కువగానే చేస్తారు. అయితే ఆహారాన్ని ఎక్కువగా ప్రాసెస్ చేయడం, అవసరానికి మించి కొనుగోలు చేస్తుండటంతో ఆహారం వృథా అవుతోందని ఐకర్యాజ్య సమితి తమ నివేదికలో పేర్కొంది. 

ఐక్యరాజ్య సమితి అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఏటా వృథా అవుతున్న ఆహారం విలువ సుమారు లక్ష కోట్ల డాలర్లు.. అంటే మన కరెన్సీలో రూ.75 లక్షల కోట్లు ఉంటుంది. వృథా అయిన ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి వాడుతున్న భూమి విస్తీర్ణం ఏకంగా 1.35 కోట్ల చదరపు కిలోమీటర్లు ఉంటుందని ఐక్యరాజ్య సమితి పేర్కొంది.    

 

 

 

Leave a Comment