ప్రధాని మోడీకి ఎక్కాలే రావు.. బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి..!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ స్థాయిలో కీలక పాత్ర పోషించాలని ప్రముఖ ఆర్థిక వేత్త, బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఆకాంక్షించారు. ఓ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దేశానికి బలమైన ప్రతిపక్షం కావాలని ఆయన అభిప్రాయపడ్డారు. 

దేశంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక వ్యస్థ దారుణంగా దెబ్బతిన్నదని, ఆర్థిక రంగంపై మోడీకి కనీస అవగాహన లేదని సుబ్రమణ్యస్వామి అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే దేశంలో ఆర్థిక మాంద్యం తప్పదని హెచ్చరించారు. దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో పయనిస్తుందన్నారు. 

కరోనాకు ముందు నుంచి దేశ ఆర్థిక వృద్ధిరేటు తగ్గుతూ వస్తుందని ఆయన అన్నారు. ప్రధాని మోడీకి ఎకనామిక్స్ అర్థం కాదని, ఆయన అర్థం కూడా చేసుకోరని వ్యాఖ్యానించారు. ప్రధాని మోడీ హఠాత్తుగా జీడీపీని ఐదేళ్లలో డబుల్ చేస్తానని అంటారని, అసలు ఇది సాధ్యమేనా అని ప్రశ్నించారు. ఐదేళ్లలో ఎకానమీని రెట్టింపు చేయాలంటే అర్థమెటిక్స్ ని అర్థం చేసుకోవాలని, కానీ మోడీకి సింపుల్ అర్థమెటిక్ కూడా తెలియదని అన్నారు. ఎకానమీ గురించి చెప్పే సలహాదారులు ఆయనకు లేరన్నారు. మోడీ నిర్ణయాలను ప్రశ్నిస్తే.. ఐటీ, ఈడీ దాడులు చేయిస్తారన్నారు. పత్రికల్లో ఏం రావాలో పీఎంవో నిర్దేశిస్తున్నదని, ఇలాగే కొనసాగితే దేశంలో ఆర్థిక మాంద్యం వస్తుందన్నారు.  

దేశ జీడీపీ తగ్గడానికి మరో కారణం పన్నులను పెంచుతూ పోవడమే అని, ఇన్ కమ్ ట్యాక్స్ అనేది ప్రజలకు యూజ్ లెస్ ట్యాక్స్ అని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే పన్నులు, ఆదాయం వచ్చే ఇతర మార్గాలను పెంచుకోవాలన్నారు. పబ్లిక్ వర్స్ కోసం ప్రజలపై పన్నులు వేయవద్దన్నారు. ఇప్పుడున్న ఆర్థిక విధానాలు ఇదేవిధంగా కొనసాగితే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని పేర్కొన్నారు. 

ప్రస్తతం దేశానికి బలమైన ప్రతిపక్షం అవసరమని సుబ్రమణ్యస్వామి అభిప్రాయపడ్డారు. దేశంలో అధికారపార్టీ చేసే తప్పులను ఎత్తిచూపే పార్టీ కావాలని, భయపెడితే భయపడే పార్టీ కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పాత్ర పోషించలేదన్నారు. దేశానికి కేసీఆర్ వంటి నాయకుడి అవసరం ఉందని, ఆయన దేశానికి బలమైన ప్రతిపక్షంగా ఉండాలని అభిప్రాయపడ్డారు.  

Leave a Comment