అక్కడ రూపాయికే ఇడ్లీ..16 ఏళ్లుగా ఇదే ధర.. హ్యాట్సాఫ్ రాంబాబు..!

రూపాయికి ఏం వస్తుంది? ఈరోజుల్లో ఓ టీ తాగాలన్న రూ.10లు ఉంటుంది. కానీ ఆ హోటల్ లో మాత్రం ఒక్కరూపాయికి ఇడ్లీ వస్తుంది. అది కూడా రుచికరమైన మూడు చట్నీలతో.. ఏంటీ నమ్మడం లేదా.. నిజమండీ బాబు.. ఎక్కడో కాదు మన ఆంధ్రప్రదేశ్ లోనే..  

తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం-కాకినాడ ఏడీబీ రోడ్డులో కొత్తూరు జంక్షన్ నుంచి 3 కిలోమీటర్ల దూరం వెళ్తే ఆర్ బీ కొత్తూరు గ్రామం ఉంటుంది. ఆ గ్రామంలోనే ఈ చౌకైన హోటల్ ఉంది. పెద్దాపురం మండల పరిధిలోని ఈ గ్రామానికి చెందిన చిన్ని రామకృష్ణ అలియాస్ రాంబాబు, రాణి దంపతులు ఇంటి బయట పూరి గుడిసేలో 16 సంవత్సరాలుగా ఈ హోటల్ ను నిర్వహిస్తున్నారు. ఈ హోటల్ లో రూపాయికే 3 చట్నీలతో ఇడ్లీ అమ్ముతున్నారు. ఇక్కడ మైసూర్ బజ్జీ కూడా కేవలం ఒక్క రూపాయికే దొరుకుతుంది.

మొదట్లో ఊరిలో ఉన్న హోటళ్లు అన్నింట్లో రూపాయికే ఇడ్లీ దొరికేది. కానీ నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోయాయి. దీంతో మిగిలిన హోటళ్లలో ఇడ్లీ ధరలను పెంచేశారు. కానీ రాంబాబు మాత్రం తన హోటల్ లో ఇడ్లీ ధరను పెంచలేదు. ఇప్పటికీ రూపాయికే అమ్ముతున్నాడు. రాంబాబు హోటల్ లో పరిశుభ్రతను పాటిస్తాడు. అంతేకాదు ఇక్కడ దొరికే ఇడ్లీ కూడా నాణ్యంగా ఉంటుంది. దీంతో గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతాల నుంచి కూడా రాంబాబు ఇడ్లీ కోసం వస్తుంటారు. హోటల్ ఇంట్లోనే నిర్వహిస్తుండటంతో అద్దె కట్టే పని లేదని, తక్కువ ధరకు ఎక్కువ మొత్తంలో విక్రయిస్తుండటంతో పెద్దగా లాభాలు లేకపోయినా హోటల్ నడిపిస్తున్నామని రాంబాబు చెబుతున్నాడు. రోజుకు సుమారు 500 మంది తన హోటల్ కు వస్తారని తెలిపాడు. నష్టం లేకుండానే వ్యాపారం చేస్తున్నానని, తక్కువ ధర కావడంతో ఒత్తిడి ఉంటుందని అన్నాడు. కానీ ఇది తనకు చాలా సంతృప్తి కలిగిస్తుందని రాంబాబు చెబుతున్నాడు. ఈ రోజుల్లో కూడా లాభం అశించకుండా రూపాయికే ఇడ్లీ అందిస్తున్న రాంబాబుకు హ్యాట్సాఫ్.. 

Leave a Comment