ఇంజనీర్ ఉద్యోగం వదిలి.. ఆవు పేడ, మూత్రంతో వ్యాపారం..!

ఏదైన సొంతంగా వ్యాపారం చేయాలని భావించాడు. అందుకోసం చేస్తున్న ఇంజనీర్ ఉద్యోగాన్ని వదిలేశాడు. తనకు ఏమాత్రం అనుభవం లేని పాడి పశువుల వ్యాపారంలోకి దిగాడు. గోమాత తనకు అన్యాయం చేయదని ఆశతో ఈ వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఆవు పేడ, మూత్రంతో నెలకు రూ.10 లక్షలు సంపాదిస్తున్నాడు.. 

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన 26 ఏళ్ల జయగురు తన గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. నెలకు రూ.22 వేల జీతంతో ఆ సంస్థలో పనిచేశాడు. కానీ ఉద్యోగం చేయడం జయగురుకు ఇష్టం లేదు. ఏదైన సొంతం చేయాలని అనుకున్నాడు. దీంతో 2019లో తన ఉద్యోగాన్ని వదిలేశాడు. 

జయగురు తండ్రి పాడి పశువుల వ్యాపారం చేస్తాడు. ఆ వ్యాపారాన్నే విస్తరించాలని అనుకున్నాడు. ఆ దిశగా తన పరిశోధన ప్రారంభించాడు. అతడి డెయిరీ ఫామ్ సక్సెస్ అయింది. తర్వాత ఆవు పేడను ఆరబెట్టే యంత్రాన్ని కొనుగోలు చేశాడు. దీంతో ప్రతిరోజూ దాదాపు వెయ్యి బస్తాల ఆవుపేడను విక్రయిస్తున్నాడు. అంతేకాదు ఆవు పేడ, మూత్రం మిశ్రమం కలిపి ఆవు పేడ స్లర్రీని కూడా తయారు చేస్తున్నాడు. ఈ మిశ్రమం రైతులకు బాగా ఉపయోగపడుతుంది. ఆవులను స్నానం చేయించడానికి వాడే నీటిని కూడా వృధాగా పోనివ్వడం లేదు. ఆ నీటిని పంట పొలాలకు వినియోగించే విధంగా ఏర్పాటు చేశాడు. 

ఇక జయగురు రోజుకు దాదాపు 30-40 కిలోల నెయ్యి, 750 లీటర్ల పాలను విక్రయిస్తున్నాడు. ఇక పనులు చేయడానికి 10 మంది సిబ్బంది కూడా ఉన్నారు. పాలు పితికే యంత్రంతో సహా అనేక యంత్రాలు తన వద్ద ఉన్నాయి. దీంతో పశువుల షెడ్ శుభ్రం చేసేందుకు ఎక్కువ సమయం పట్టదు. ప్రభుత్వ ప్రోత్సాహంతో తన వ్యాపారాన్ని మరింత విస్తరించాలని అనుకుంటున్నాడు జయగురు..  

Leave a Comment