ఆర్డర్ క్యాన్సిల్ చేసినందుకు యువతిపై జొమాటో బాయ్ దాడి..!

ఆర్డర్ క్యాన్సిల్ చేసినందుకు ఓ యువతిపై జొమాటో డెలివరీ బాయ్ దాడికి పాల్పడ్డాడు. రక్తం వచ్చేలా ఆమెపై పిడిగుద్దులు గుద్దాడు. వివరాల మేరకు బెంగళూరుకు చెందిన బ్యూటీ ఇన్ ఫ్లుయెన్సర్ హితేషా చంద్రానీ ప్రముఖ ఫుడ్ డెలీవరీ సంస్థ జొమాటోలో మార్చి 9న మధ్యాహ్నం 3.30 గంటలకు ఆర్డర్ చేసింది.

ఈ ఆర్డర్ సాయంత్రం 4.30 గంటలకు డెలివరీ చేయాల్సి ఉంది. అయితే ఆర్డర్ సమయానికి రాలేదు. ఆర్డర్ రావడంలో ఆలస్యం కావడంతో హితేషా కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ తో మాట్లాడి తన ఆర్డర్ క్యాన్సిల్ చేయాలని కోరింది. ఇంతలోనే డెలివరీ బాయ్ ఆర్డర్ తీసుకొచ్చాడు. 

ఈక్రమంలో డెలివరీ బాయ్ కామరాజ్ హితేషాతో ఘర్షణకు దిగాడు. బలవంతంగా ఇంట్లోకి వచ్చి హితేషాపై పిడిగుద్దులు గుద్దాడు. తర్వాత ఆర్డర్ తీసుకొని పారిపోయాడు. రక్తమోడిన తన ముఖంతో హితేషా వీడియోను రికార్డ్ చేసి పోస్ట్ చేసింది. జొమాటో సేవలు సురక్షితమేనా అని, తనకు మద్దతుగా నిలవాలని కన్నీరుమున్నీరు అయింది.    

 

Leave a Comment