‘వైఎస్సార్‌ చేయూత’ పథకం ప్రారంభం..!

రాష్ట్రంలోని అక్కచెల్లెమ్మల కోసం సీఎం జగన్ ప్రవేశపెట్టిన వైఎస్సార్ చేయూత పథకాన్ని బుధవారం క్యాంపు కార్యాలయంలో ప్రారంభించారు. ఈ పథకం ద్వారా 45-60 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు లబ్ధిపొందారు. తొలివిడతగా వారి ఖాతాల్లోకి 18,750 రూపాయాలు జమ అయ్యాయి. ప్రతి ఏడాది నాలుగేళ్ల పాటు మహిళల ఖాతాల్లోకి రూ.18,750, మొత్తంగా రూ.75 వేలు జమ చేయనున్నారు. 

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ ‘ఈ పథకాన్ని నా అదృష్టంగా భావిస్తున్నాను. మహిళల కోసం ఎటువంటి పథకాలు లేవు. అందుకోసం 45-60 ఏళ్ల మధ్య ఉన్న మహిళలందరికీ మంచి జరగాలనే ఈ పథకాన్ని ప్రవేశపెట్టాం. గతంలో కార్పొరేషన్ రుణాలు ఇచ్చేవారు. అవి కూడా రాజకీయ పలుకుబడి ఉండి, లంచాలు ఇస్తే వచ్చేవి. దీని వల్ల ఎవరికీ ఉపయోగం ఉండేది కాదు. ఇవన్నీ మార్పులు చేస్తూ, ఈ వయస్సులో ఉన్న అక్కలకు తోడుగా ఉండాలనే ఉద్దేశ్యంతో కార్పొరేషన్ ను ప్రక్షాళన చేశాం’ అని సీఎం జగన్ వివరించారు. 

మొదట పెన్షన్ రూపంలో డబ్బు ఇద్దామనుకున్నామని, కానీ 45 ఏళ్లకే పెన్షన్ ఏంటని కొందరు వెటకారం చేశారని సీఎం జగన్ అన్నారు. ఇప్పుడు ఏడాదికి రూ.18750 చొప్పున రూ.75 వేలు ఇస్తున్నామని పేర్కొన్నారు. ఇక మహిళలకు వ్యాపార అవకాశాలను కల్పించేందుకు పాల రంగంలో దేశంలోనే దిగ్గజ సంస్థ అయిన అమూల్ తో ఒప్పందం కుదుర్చుకున్నామన్నారు. రియలన్స్, హిందుస్థాన్‌ లీవర్, ప్రాక్టర్‌ అండ్‌ గాంబల్, ఐటీసీ లాంటి దిగ్గజ కంపెనీలో ఒప్పందాలు చేసుకున్నామన్నారు.  రాబోయే కాలంలో మరిన్ని పెద్ద కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటామని వెల్లడించారు. 

ప్రతి అక్కకు, చెల్లెమ్మకు 2 పేజీల లేఖ కూడా పంపిస్తున్నామని, ప్రభుత్వం చూపుతున్న వ్యాపార అవకాశాలను ఉపయోగించుకోవాలని, దాని ద్వారా మేలు పొందాలని అనుకుంటే…  ఆప్షన్‌ ఇవ్వొచ్చని సీఎం పేర్కొన్నారు. దీని కోసం బ్యాంకులతో కూడా ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుందన్నారు. కంపెనీలు.. తమ ఏజెన్సీలకు ఇచ్చే రేటుకన్నా తక్కువ రేటుకు తమ ఉత్పత్తులను ఇస్తారని చెకప్పారు. దీనివల్ల ఎక్కువ లాభాలను పొందే అవకాశం ఉంటుందన్నారు.  

వైఎస్సార్ చేయూత ద్వారా దాదాపు 23 లక్షల కుటుంబాలకు మేలు జరుగుతుందని సీఎం చెప్పారు. జాబితాలో ఎవరిపేరైనా లేకపోతే ఎవ్వరూ కూడా కంగారు పడాల్సిన పనిలేదని, గ్రామ సచివాలయానికి వెళ్లి అర్హతలు చూసుకుని మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వచ్చే నెలలో ఈ దరఖాస్తులను పరిశీలించి అందరికీ అందేలా చర్యలు తీసుకుంటారన్నారు. 

60 ఏళ్లకు వృద్ధాప్య పెన్షన్‌:

ఇక 60 ఏళ్లకు చేరువలో ఉన్న అక్క చెల్లెమ్మలకు, 60 ఏళ్లు రాగానే వృద్ధాప్య పింఛను వస్తుందన్న సీఎం, అదే సమయంలో 45 ఏళ్లు వచ్చిన వారికి కొత్తగా అర్హతలను బట్టి పథకంలో చేరుస్తామని చెప్పారు.

 

Leave a Comment