కరోనా వ్యాక్సిన్ తీసుకున్న 19 ఏళ్ల యువకుడు మృతి..!

కరోనా వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్న యువకుడు మరణించాడు. వ్యాక్సిన్ తీసుకన్న 48 గంటల్లో ఆ యువకుడు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సెహోర్ జిల్లాలో జరిగింది. జిల్లాలోని భన్వ్రా గ్రామానికి చెందిన శుభమ్ పర్మార్(19)కు నవంబర్ 6న మొదటి డోస్ కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలో అరగంట పాటు ఉన్న శుభమ్ తర్వాత ఇంటికి వచ్చేశాడు. 

మరుసటి రోజు ఉదయం నుంచి శుభమ్ వాంతులు చేసుకోవడం ప్రారంభించాడు. దీంతో కుటుంబ సభ్యులు అస్టాలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో సెహోర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. శుభమ్ అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మరణించినట్లు అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. 

పోస్ట్ వ్యాక్సినేషన్ ప్రోటోకాల్ ప్రకారం శుభమ్ ఆరోగ్యాన్ని పర్యవేక్షించామని, మరణానికి గల కారణాలను పరిశీలిస్తామని అష్టా బ్లాక్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీర్ గుప్తా తెలిపారు. భోపాల్ లోని ఎయిమ్స్ లో శుభమ్ శవానికి పోస్టుమార్టం నిర్వహించారని, నివేదిక వచ్చిన తర్వాత మరణానికి కచ్చితమైన కారణం తెలుస్తుందని చెప్పారు. ఎనిమిది రోజుల్లో సంబంధిత పోలీస్ స్టేషన్ లో నివేదిక అందజేస్తామని ఎయిమ్స్ వైద్యులు తెలిపినట్లు మృతుడి తండ్రి మాన్ సింగ్ తెలిపారు.

 

Leave a Comment