చంద్రబాబు ఇంటి వద్ద హైటెన్షన్.. టీడీపీ, వైసీపీ కార్యకర్తల రాళ్ల దాడి..! 

ఆంధ్రప్రదేశ్ మాజీ శాసనసభపతి కోడెల శివ ప్రసాద్ వర్థంతి సభలో టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏపీ సీఎం జగన్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ను, ఏపీ మంత్రులను బూతులు మాట్లాడారు. పరిపాలన చేతకాని వారు రాష్ట్రాన్ని పాలిస్తున్నారంటూ అయ్యన్న వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ కార్యకర్తలు నిరసన చేపట్టారు. సీఎం జగన్ పై అయ్యన్న పాత్రుడు చేసిన అనుచిత వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పాలని వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ తో పాటు వైసీపీ కార్యకర్తలు.. ఉండవల్లి లోని చంద్రబాబు ఇంటి వద్ద నిరసన చేపట్టారు. చంద్రబాబు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.  

ఈక్రమంలో వైసీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. అటు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న, టీడీపీ కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. టీడీపీ కార్యకర్తలు ఎమ్మెల్యే జోగి రమేష్ కారుపై రాళ్ల దాడి చేసి అద్దాలు ధ్వంసం చేశారు. జెండా కర్రలతో వైసీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు కొట్టుకున్నారు. 

ఇరు వైపుల పెద్ద ఎత్తున కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కరకట్టపై ఉన్న పోలీస్ చెక్ పోస్ట్ వద్ద వైసీపీ కార్యకర్తలను బుద్ధా వెంకన్న అనుచరులు అడ్డుకున్నారు. వైసీపీ ఎమ్మెల్యే, బుద్ధా వెంకన్న మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు ఇరు వర్గాలను నచ్చజెప్పి అక్కడి నుంచి పంపిచే ప్రయత్నం చేశారు. 

 

Leave a Comment