వైసీపీ నేతలే కరోనా వ్యాపకులు : దేవినేని ఉమ

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రాష్ట్రంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయని, కరోనా కట్టడిలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మార్చిలో నమోదైన ఐదు కరోనా కేసులు నేడు 60 వేలు దాటాయన్నారు. వందలమంది కరోనాబారిన పడి చనిపోతున్నారన్నారు. మాస్కులు అడిగిన డాక్టర్ ను సస్పెండ్ చేశారన్నారు. కరోనా నిరంతర ప్రక్రియ అంటూ సీఎం జగన్ తేలిగ్గా కొట్టిపారేశారని విమర్శించారు. 

కరోనా సామాజిక వ్యాప్తి మొదలైందని, కరోనా బాధితులను చూస్తుంటే బాధేస్తుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సౌకర్యాలను సీఎం జగన్ పరిశీలించాలన్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో వెంటిలేటర్లు, బెడ్లు ఎన్ని ఉన్నాయో ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కరోనా సోకిన అధికారపార్టీ నేతలు కార్పొరేట్ ఆస్పత్రులకెళుతున్నారని విమర్శించారు. కరోనా బారినపడిన సామాన్యులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు.

ముఖ్యమంత్రి సహా నేతలెవరూ కరోనా నిబంధనలు పాటించడంలేదని, వైసీపీ నేతలే కరోనా వ్యాపకులుగా మారారని ఆరోపించారు. ప్రాణాలు పోతున్నా అంబులెన్స్ లు రావడంలేదని,  అంబులెన్సుల పేరుతో రూ. 307 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.క్వారంటైన్ సెంటర్లలో పరిస్థితి దారుణంగా ఉందన్నారు. క్వారంటైన్ సెంటర్లలో భోజనం కంటే అన్నా క్యాంటీన్ లో భోజనమే బాగుందని బాధితులంటున్నారన్నారు. కరోనాకు సంబంధించి ప్రభుత్వం వాస్తవ లెక్కలను దాస్తోందన్నారు. ప్రభుత్వ బాధ్యతారాహిత్యం వల్ల అమాయకులు బలవుతున్నారన్నారు. 

ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఏం సాయం చేశారో ప్రభుత్వం చెప్పాలని కోరారు. కరోనా కట్టడిలో ప్రభుత్వం చేయాల్సిన పనిని టీడీపీ చేస్తోందన్నారు. కరోనాపై ప్రజల్లో తెలుగుదేశం చైతన్యం తీసుకొస్తోందన్నారు. కరోనా బాధితులకు అండగా నిలబడతామన్నారు. ఇబ్రహీంపట్నంలో లే అవుట్ తెలుగుదేశం ప్రభుత్వం వేసిందన్నారు. తామిచ్చిన పట్టాల్లో ముఖ్యమంత్రి మొక్క నాటారన్నారు. పేదల ఇళ్ల కోసం పట్టాలు ఎప్పుడిచ్చారో ముఖ్యమంత్రి చెప్పాలన్నారు. ప్రభుత్వ చేతకానితనాన్ని టీడీపీకి అంటగట్టాలని చూస్తున్నారని విమర్శించారు. ఇళ్ల పట్టాలను ఇవ్వలేకపోవడం వైసీపీ చేతకానితనమని ఎద్దేవ చేశారు. రాజ్యాంగంపట్ల వైసీపీకి గౌరవం లేదని, ప్రభుత్వ నిర్ణయాలను కోర్టులు తప్పుబట్టినా మార్పురావడం లేదని ఉమా విమర్శించారు. 

 

Leave a Comment