మోడీకి సామాన్యురాలి చేతి వంట.. దిగ్గజ చెఫ్ లను కాదని యాదమ్మను..!

జులై 2 నుంచి జరగనున్న బీజేపీ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని మోడీ హాజరవుతున్న సంగతి తెలిసిందే.. ఈ సమావేశాలకు వచ్చే మోడీకి అచ్చ తెలంగాణ వంటల రుచి చూపించాలని బీజేపీ నేతలు నిర్ణయించుకున్నారు. సాధారణంగా ప్రధానికి వడ్డించే ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. నిపుణులైన చెఫ్ లతో వడ్డిస్తుంటారు.. కానీ ఈసారి ప్రధాని మోడీకి ఓ సామాన్యురాలి చేతి వంటను రుచి చూపించబోతున్నారు. ఏరికోరి మరీ ఆమెను ఎంపిక చేశారు.. 

ఎవరీ యాదమ్మ?

ప్రధాని మోడీకి వడ్డించేందుకు కరీంనగర్ జిల్లాకు చెందిన గూళ్ల యాదమ్మ అనే మహిళను రాష్ట్ర బీజేపీ నాయకులు ఎంపిక చేశారు. యాదమ్మ గత మూడు దశాబ్దాలుగా వంటలు చేస్తూ జీవిస్తోంది.. యాదమ్మ స్వగ్రామం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లి గ్రామం.. ఆమెకు 15 సంవత్సరాలు ఉన్నప్పుడు జిల్లాలోని చిగురుమామిడి మండలం కొండాపూర్ కి చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. 

దీంతో కరీంనగర్ చేరుకున్న యాదమ్మ మంకమ్మతోటలో వెంకన్న అనే వ్యక్తి దగ్గర వంటలు నేర్చుకుంది. అప్పటి నుంచి ఆమె వంటలు చేసుకుంటూ జీవినం కొనసాగిస్తోంది. ఈమె చేసే శాకాహార, మాంసాహార వంటకాలు బాగా ఫేమస్.. ఏకంగా 10 వేల మందికి కూడా ఇట్టే వండి పెట్టేయగల నేర్పరిగా  యాదమ్మ పేరు తెచ్చుకున్నారు. గతంలో మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్ పాల్గొన్న కార్యక్రమాలతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహించిన సమావేశాల సందర్భంగా వంటలు చేయడంతో మంచి గుర్తింపు వచ్చింది. 

ఆ గుర్తింపుతోనే ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా యాదమ్మ వంటలను పరియచం చేయాలనే ఉద్దేశంతో బండి సంజయ్ బుధవారం ఆమెను హైదరాబాద్ పిలిపించారు. ఆమెతో కొన్ని వంటకాలు చేయించి రుచి చూశారు. నోవాటెల్ హోటల్ లో చెఫ్ లతో కలిసి వంటలు చేయాల్సిదిగా యాదమ్మను కోరారు. 

సమావేశాల్లో పూర్తి శాకాహార వంటకాలు చేయాలని చెప్పారని యాదమ్మ తెలిపింది. పులిహోర, పప్పు అన్నం, దద్దోజనం, బగార వంటి ఐదారు రకాల వంటలు, గంగవాయిలి కూర పప్పు, పచ్చిపులుసు, సాంబారు, గుత్తి వంకాయ వంటి కూరగాయలు వండుతామని, సకినాలు, సర్వపిండి, అరిసెల, భక్షాలు, పాయసం, పప్పుగారెలు, లడ్డు వంటి తయారు చేస్తామని చెప్పింది. మోడీ సార్ తాను చేసే వంట తింటారంటే అంతకంటే భాగ్యం ఏముంటుందని యాదమ్మ ఆనందం వ్యక్తిం చేసింది. 

 

 

 

 

 

Leave a Comment