బటన్ నొక్కితే ఆయనకే క్రెడిట్.. మాకేం లేదు.. దర్శి ఎమ్మెల్యే ఆవేదన..!

ప్రకాశం జిల్లా వైసీపీ ప్లీనరీ సమావేశంలో దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. నియోజకవర్గంలో రూ.100 కోట్లు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. కార్యకర్తలను అప్పులపాలు చేశామన్నారు. సంక్షేమ పథకాలతో బటన్ నొక్కితే సీఎం జగన్ గ్రాఫ్ పెరుగుతోందని, వైసీపీ ఎమ్మెల్యేల గ్రాఫ్ మాత్రం పడిపోతుందని వ్యాఖ్యానించారు. 

బిల్లులు రాకపోవడంతో పనులు చేసిన కార్యకర్తలు ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ కార్యకర్త ఆరు నెలల నుంచి కనిపించడం లేదని, గడప గడపకు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆయన ఇంటికి వెళ్తే.. అతడి భార్య బయటకు వచ్చి.. రూ.25 లక్షల విలువైన పనులు చేసి.. బిల్లలు రాకపోవడంతో ఇల్లు కూడా అమ్ముకున్నామని, అందుకే బయట ముఖం చూపలేక ఇంట్లోనే ఉంటున్నారని చెప్పిందన్నారు. తమకేనా ఇలా చేసేదని ఆవేదన వ్యక్తం చేసిందన్నారు. 

గడప గడపకు వెళ్తే.. రోడ్లు ఎప్పుడు వేస్తారు? నీళ్లు ఎప్పుడు ఇస్తారు అంటూ ప్రజలు ప్రశ్నిస్తున్నారన్నారు. గడప లోపల బాగుంది కానీ.. గడప బయట మాత్రం పరిస్థితి బాగోలేదని ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ తెలిాపారు. సంక్షేమ పథకాల పేరుతో సీఎం జగన్ బటన్ నొక్కితే ఆయనకే నేరుగా క్రెడిట్ వెళ్తోంది కానీ.. ఎమ్మెల్యేలకు పేరు రావడం లేదన్నారు. ఎమ్మెల్యేల గ్రాఫ్ పెరగాలంటే నాలుగు సీసీ రోడ్లు వేయాలని, చేసిన పనులకు బిల్లులు ఇప్పించాలని, లేకపోతే ఎమ్మెల్యేల పరిస్థితి ఇంతే అంటూ వ్యాఖ్యానించారు. 

 

 

Leave a Comment