కట్టుకున్న చీరతో వందల మంది ప్రాణాలు కాపాడిన మహిళ..!

ఓ మహిళ తన సమయ స్ఫూర్తితో రైలు ప్రమాదాన్ని నివారించి వందల మంది ప్రాణాలు కాపాడింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని ఎటా జిల్లా కుస్బా రైల్వే స్టేషన్ సమీపంలో గురువారం చోటుచుసుకుంది. వివరాల మేరకు జిల్లాలోని అవగాడ్ మండలం గులేరియా గ్రామానికి చెందిన 65 ఏళ్ల ఓంవతి అనే మహిళ రైలు పట్టాల మీదుగా పొలానికి వెళ్లింది. 

కుస్బా రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే ట్రాక్ విరిగినట్లు ఆమె గుర్తించింది. ఇక్కడ ప్రమాదం జరగవచ్చని గ్రహించింది. ఎలాగైనా డ్రైవర్ ని అప్రమత్తం చేయాలని భావించింది. అయితే రైలు వస్తున్నట్లు కూత కూడా వినిపించింది. దీంతో ఏంచేయాలో ఆమెకు అర్థం కాలేదు. వెంటనే ఆమెకు ఓ ఐడియా వచ్చింది. 

రైలు పట్టాలు విరిగిన చోట నుంచి కాస్త దూరం రైలు వస్తున్న వైపు ముందుకు వెళ్లింది. అక్కడ పట్టాలకు ఇరువైపుల రెండు కొమ్మలను పాతిపెట్టింది. ఆ కొమ్మలకు తాను కట్టుకున్న ఎర్ర చీరను విప్పేసి కట్టింది. ఎటా నుంచి తుండ్లా వెళ్లే ప్యాసింజర్ రైలు డ్రైవర్ చీర చూసి బ్రేకులు వేశారు. దీంతో ప్యాసింజర్ రైలు ఆగిపోయింది. 

డ్రైవర్ దిగి పరిస్థితిని తెలుసుకున్నాడు. రైల్వే ఉన్నతాధికారులకు పరిస్థితిని వివరించాడు. ఆ తర్వాత రైల్వే ట్రాక్ కి మరమ్మతులు చేయించాడు. సుమారు గంట తర్వాత రైలు అక్కడి నుంచి పయనమైంది. ఆమె చేసిన సాహసాన్ని అక్కడి వారంతా అభినందించారు. ఆమెకు కొంత నగదు అందజేశారు. ఉత్తరప్రదేశ్ పోలీస్ సచిన్ కౌశిక్ ఈ ఘటన వివరాలను, మహిళ ఫొటోలను, విరిగిన ట్రాక్ ను సోషల్ మీడియాలో పోస్టు చేశారు.       

 

 

Leave a Comment