సెకండ్ హ్యాండ్ ఫోన్ కొని చిక్కుల్లో మహిళ..!

కరోనా ప్రభావంతో పాఠశాల యాజమాన్యాలు విద్యార్థుల కోసం ఆన్ లైన్ తరగతులను జరుపుతున్నాయి. అయితే ఈ ఆన్ లైన్ తరగతులు కొంత మంది పేద విద్యార్థులకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. తాజాగా ఓ తల్లి తన కొడుకు ఆన్ లైన్ చదువుల కోసం దాదాపు మూడు నెలల పాటు కష్టపడి సెకండ్ హ్యాండ్ లో ఓ స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసి చిక్కుల్లో పడింది. అయితే అది చోరీ చేసిన ఫోన్ కావడంతో ఓ రోజు మొత్తం పోలీస్ స్టేషన్ లో ఉండాల్సి వచ్చింది. ఈ ఘటన ముంబైలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

ముంబైలోని బోరివ్లీకి చెందిన స్వాతి సుభాష్ సావ్రే తన 8 ఏళ్ల కొడుకు ఆన్ లైన్ తరగతుల కోసం కొద్ది రోజుల క్రితం రూ.6 వేలు పెట్టి సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుగోలు చేసింది. దానికి రిపేర్ల కోసం ఇంకో రూ.1500 ఖర్చు చేసింది. తర్వాత ఆ ఫోన్ లో సిమ్ వేసుకుని వాడటం ప్రారంభించింది. అయితే అది చోరీకి గురైన ఫోన్ కావడంతో పోలీసులు ఆమె ఇంటి వద్దకు వచ్చిన ఆమెను తీసుకెళ్లారు. 

అయితే ఆ ఫోన్ ను ఆమె చోరీ చేయలేదని, ఆ చోరీకి ఆమెకు సంబంధం లేదని పోలీసులు నిర్ధారించుకున్నారు. తర్వాత ఆమెను వదిలేశారు. ఫోన్ లేకపోవడంతో తన కొడుకు ఆన్ లైన్ చదువు నిలబడిపోయే పరిస్థితి ఉందని.. ఆమె తన ఇంటి యజమానితో చెప్పుకుంది. ఆ యజమాని ఈ విషయాన్ని ముంబై పోలీసులకు ట్వీట్ చేశారు. ఆమె కష్టాలు గుర్తించిన ఉన్నతాధికారులు వెంటనే గుర్తించారు. ఆమెకు కొత్త ఫోన్ కొని గిఫ్ట్ గా ఇచ్చారు.   

 

Leave a Comment