ఆడపిల్ల పుట్టిందని ఇంట్లోకి రానివ్వలేదు..!

ఆడపిల్ల పుట్టిందని ఓ భర్త తన భార్యను ఇంట్లోకి రానివ్వలేదు. దీంతో ఆ మహిళ తన అత్తవారి ఇంటి వద్ద బైఠాయించింది. ఈ ఘటన నర్సీపట్నం మున్సిపాలిటీలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల మేరకు రావికమతం గ్రామానికి చెందిన టి.పార్వతికి నర్సీపట్నం మున్సిపాలిటీ పెదబొడ్డేపల్లికి చెందిన రామకృష్ణతో 2019 మార్చిలో వివాహం జరిగింది. రామకృష్ణ విశాఖలో వార్డు సచివాలయం సెక్రటరీగా పనిచేస్తున్నాడు. 

రామకృష్ణకు పెళ్లిలో రూ.12 లక్షల నగదు, నాలుగు తులాల బంగారం కట్నంగా ఇచ్చారు. పార్వతికి ఏడాదిన్నర క్రితం పాప పుట్టింది. పార్వతిని కాపురానికి తీసుకురావడానికి ఆమె అత్త, మామలు అడ్డుపడుతున్నారు. ఆడపిల్ల పుట్టిందని, తల్లిపేరు మీద ఉన్న భూమి రాయించుకురావలని ఒత్తిడి చేస్తున్నారని పార్వతి ఆరోపించింది. భూమి రాయించుకురాకపోవడంతో కాపురానికి తీసుకురాలేదని తెలిపింది. 

దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే నెలరోజుల్లో కాపురానికి తీసుకెళ్తానని రావికమతం పోలీస్ స్టేషన్ లో భర్త అంగీకరించాడని, ఆ తర్వాత పట్టించుకోలేదని పార్వతీ వాపోయింది. మానసిక వేదనలతో తన తల్లి ఇటీవల మరణించిందని, తండ్రి చనిపోవడంతో తోబుట్టువు వద్ద ఉంటున్నానని చెప్పింది. 

తన బంధువులతో కలిసి భర్త ఇంటికిి వస్తే అత్త, మామలు లోపలికి రానివ్వలేదని తెలిపింది. దీంతో న్యాయం చేయాలని భర్త ఇంటి ముందు బైఠాయించినట్లు చెప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితురాలు, భర్త తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. 

Leave a Comment