వాతావరణ శాఖ హెచ్చరిక..భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం..

భారత వాతావరణ శాఖ సూచనల ప్రకారం తూర్పు మధ్య బంగాళఖాతంలో రాగల 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడనుంది. ఈ అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఆ తదుపరి 24 గంటల్లో బలపడనుంది. దీని ప్రభావంతో రాగల నాలుగు రోజుల్లో ఉత్తరాంధ్రలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. 

దీంతో పాటు రాయలసీమలో పిడుగులు పడే అవకాశం ఉందని పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల కింద, చెరువు, నీటి కుంటల దగ్గర, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. పిడుగుల పట్ల అశ్రద్ధవిహించవద్దన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని కోరారు. 

ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు ఉన్నందును లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కమిషనర్ సూచించారు. ఉత్తరాంధ్ర జిల్లాల యంత్రాంగాన్ని, అధికారులను అప్రమత్తం చేశారు.

రాగల నాలుగు రోజులు వాతావరణ సూచనలు..

  • జూన్ 9న కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం.
  • కోస్తాంధ్ర, రాయలసీమలో పిడుగులు పడే అవకాశం ఉంది.
  • జూన్ 10న కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం.
  • తీరం వెంబడి 30-40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయి.
  • రాయలసీమలో పిడుగులు పడే అవకాశం.
  • జూన్ 11, 12న కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉంది. 
  • రాయలసీమలో పిడుగులు పడే అవకాశం ఉంది.  

 

Leave a Comment