తెలంగాణలో కచ్చితంగా అధికారంలోకి వస్తాం : ప్రధాని మోడీ

హైదరాబాద్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కుటుంబంపై విమర్శలు చేశారు. హైదరాబాద్ లో బీజేపీ ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగించారు. పట్టుదలకు, పౌరుషానికి మారు పేరు తెలంగాణ ప్రజలని అన్నారు. తెలంగాణ వచ్చిన ప్రతిసారీ ప్రజలు ఎంతో ఆప్యాయతను పంచారని, వారి అభిమానం, ఆప్యాయతకు రుణపడి ఉంటానని తెలిపారు.

తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు ప్రకటించారు. వారి ఆశయాలు నెరవేర్చాలన్నారు. దేశ ఐక్యత కోసం సర్దార్ పటేల్ ఎంతో కృషి చేశారని, ఆయన కలలను సాకారం చేద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరులతో పాటు ఎవరి ఆశయాలు కూడా నెరవేరడం లేదని, కుటుంబ పాలనతో రాష్ట్రం బందీ అయ్యిందని అన్నారు. కేవలం ఒక కుటుంబం కోసం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు జరగలేదన్నారు. 

కుటుంబ పాలన ప్రజాస్వామ్యానికే ప్రమాదమని, కుటుంబ పార్టీలను తరమితేనే అభివృద్ధి సాధ్యమవుతుందని టీఆర్ఎస్ పై విమర్శలు చేశారు. తెలంగాణలో మార్పు తప్పకుండా వస్తుందన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చితీరుతుందన్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ పాలన అంతా అవినీతిమయమని, వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాడాలని బీజేపీ కార్యకర్తలకు ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.   

 

 

 

Leave a Comment