కడప జిల్లాకు అంబేద్కర్ పెరు పెట్టొచ్చు కదా? : పవన్ కళ్యాణ్

కోనసీమ జిల్లాకు పేరు మార్పుపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. జిల్లాలకు కొత్త పేర్లు పెట్టేటప్పుడే కోనసీమకు అంబేద్కర్ పేరు పెడితే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. అప్పుడు అంబేద్కర్ పేరు పెట్టి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని అన్నారు. జిల్లాకు అంబేద్కర్ పెట్టడంలో ప్రభుత్వం ఎందుకు జాప్యం చేసిందో అర్థం కావట్లేదన్నారు. 

రాష్ట్రాలు కావాలని పోరాటం చేసిన పొట్టి శ్రీరాములు పేరును నెల్లూరు జిల్లాగా నామకరణం చేశారని, మహానేత అయిన అంబేద్కర్ ను కేవలం జిల్లాకు పరిమితం చేశారని పవన్ కళ్యాన్ పేర్కొన్నారు. క్రిష్ణా నది తక్కువగా ఉన్న చోట క్రిష్ణా జిల్లా పేరు పెట్టారని, క్రిష్ణా నది ఎక్కువగా ఉన్న చోట ఎన్టీఆర్ జిల్లా అని పెట్టారని అన్నారు. 

తాను జిల్లాల పేర్లకు వ్యతిరేకమైనా.. వ్యక్తులకు వ్యతిరేకం కాదన్నారు. మిగితా జిల్లాలతో పాటు కోనసీమ జిల్లాకు అంబేద్కర్ అని పెడితే సహజంగా ఉండేదన్నారు. గొడవలు జరగాలనే అభ్యంతరాలకు సమయం ఇచ్చారని పవన్ కళ్యాణ్ విమర్శించారు. మంత్రి విశ్వరూప్ ఇంటిపై దాడి జరుగుతుంటే పోలీసులు చూస్తూ ఊరుకుంటారా అని ప్రశ్నించారు. 

మంత్రి ఇంటిపై దాడి జరుగుతుందని ముందే తెలుసు కాబట్టే.. మంత్రి కుటుంబ సభ్యులను తరలించారని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్సీ డ్రైవర్ హత్య కేసును ప్రజల దృష్టి నుంచి మళ్లించేందుకే కోనసీమ గొడవలు రేపారని ఆరోపణ చేశారు. అమలాపురం గొడవల్లో కీలకంగా వ్యవహరించిన అన్యం సాయి వైసీపీ నాయకుడే అని పవన్ అన్నారు. 

కోనసీమకే అంబేద్కర్ పేరు పెట్టడం వెనక ప్రభుత్వ ఆలోచన ఏంటని, కడప జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టొచ్చు కదా అని ప్రశ్నించారు. కోనసీమ ఘటన ఒక కులానికి సంబంధించినది కాదని, ప్రజలు సంయమనంగా ఉండాలని పవన్ కోరారు. రాజకీయ లబ్ధికోసమే అంబేద్కర్ పేరును వాడుకుంటున్నారన్నారు. అంబేద్కర్ పేరు పెట్టే విషయంలో రెఫరెండం పెట్టాలని, కోనసీమ ప్రజల అభిప్రాయాలను తీసుకోవాలని కోరారు.

Leave a Comment