ఎన్నికలకు ప్రభుత్వం రెడీ.. ఏం జరిగినా ఎస్ఈసీదే బాధ్యత : సజ్జల

పంచాయతీ ఎన్నికల విషయంలో సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తున్నామని వైసీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఎస్ఈసీ నిర్ణయించినట్లుగానే ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీగా ఎన్నికలను స్వాగతిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని వెల్లడించారు.

సోమవారం తాడేపల్లితోని సీఎం క్యాంపు కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. ప్రజారోగ్యం బాగుండాలన్న ఉద్దేశంతోనే ఎన్నికలు వాయిదా వేయాలని కోరామన్నారు. అయితే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను మధ్యలోనే నిలిపివేసి.. పంచాయతీ ఎన్నికలు నిర్వహించడంలో కుట్ర ఉందని ఆరోపించారు. 

వ్యాక్సినేషన్ పై కేంద్ర ప్రభుత్వంతో చర్చించనున్నట్లు పేర్కొన్నారు. వ్యాక్సినేషన్, ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తే గందరగోళానికి దారి తీస్తుందని సుప్రీం కోర్టుకు తెలిపినట్లు చెప్పారు. ఎన్నికల ద్వారా కరోనా పెరిగితే ఎస్ఈసీదే బాధ్యత అని సజ్జల కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు ప్రజల ప్రాణాలు, ఉద్యోగుల భద్రతే ముఖ్యం కాబట్టి కోర్టుకు వెళ్లామని సజ్జల స్పష్టం చేశారు.   

 

Leave a Comment