గాంధీల పేరుతో 3 తరాలకు సరిపడా సంపాదించాం.. కాంగ్రెస్ ఎమ్మెల్యే వ్యాఖ్యలు..!

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే, కర్ణాటక మాజీ అసెంబ్లీ స్పీకర్‌ కెఆర్‌.రమేష్‌ కుమార్‌ వివిదాస్పద వ్యాఖ్యలు చేశారు.  గాంధీలు, నెహ్రూల పేరుతో కాంగ్రెస్‌ నేతలు కావాల్సినంత డబ్బు సంపాదించారని ఆరోపించారు. సోనియా గాంధీని ఈడీ విచారించడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ పార్టీ స్థానిక ఫ్రీడమ్‌ పార్క్‌లో చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో రమేష్‌ కుమార్‌ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.

 ” జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీల పేరుతో మనం 3-4 తరాలకు సరిపడా డబ్బు సంపాదించుకున్నాం. ఇప్పుడు అందుకు తగిన ప్రతిఫలం చెల్లించేందుకు సిద్ధంగా ఉండాలి. లేకుంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతుందని భయంగా ఉంది” అని అన్నారు. 

ఎమ్మెల్యే రమేశ్‌ కుమార్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలు చేస్తోంది. ‘కాంగ్రెస్‌ పార్టీ గత 60 ఏళ్లలో ఏ విధంగా దేశాన్ని దోచుకుందనే విషయాన్ని ఎంతో అందంగా వివరించిన తెలివైన నేతకు నా శుభాకాంక్షలు’  అని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె.సుధాకర్‌ ట్వీట్ చేశారు. గతంలో రమేష్‌ కుమార్‌ అత్యాచారంపై వ్యాఖ్యలు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తడంతో బహిరంగ క్షమాపణలు చెప్పారు.

 

 

Leave a Comment