వరంగల్ విద్యార్థి అరుదైన ఘనత.. ఎలన్ మస్క్ పాఠశాలకు ఎంపిక..!

వరంగల్ కు చెందిన ఆరో తరగతి విద్యార్థి అరుదైన ఘనత సాధించాడు. అమెరికాలోని స్పేస్ ఎక్స్ కంపెనీ అధినేత, టెస్లా సీఈవో ఎలన్ మస్క్ స్థాపించిన సింథసిస్ స్కూల్ లో ప్రవేశం పొందాడు. వరంగల్ కి చెందిన అనిక్ పాల్ నిట్ సమీపంలోని ప్రభుత్వ ఆర్ఈసీ పాటక్ పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నాడు. 

అనిక్ పాల్ సింథసిస్ స్కూల్ నిర్వహించిన ప్రవేశపరీక్షలో విజయం సాధించాడు. ఈ పాఠశాలలో ప్రవేశం పొందేందుకు మూడు స్థాయిలు ఉంటాయి. మొదటగా పాఠశాల యాజమాన్యం వీడియోలు, గేమ్స్ రూపంలో ప్రశ్నలు ఇస్తుంది. వాటిని విద్యార్థులు ఎలా చేధిస్తున్నారని పరిశీలిస్తుంది. అనిక్ పాల్ మొదటి రెండు దశల్లో ప్రశ్నలకు విజయవంతంగా సమాధానాలు ఇచ్చాడు. తర్వాత ఓ వివరాణాత్మక సమస్యకు వీడియో రూపొందించి పంపించాడు. చివరికి ఆన్ లైన్ లో ఇంటర్వ్యూ నిర్వహించింది. ఆ తర్వాత అనిక్ పాల్ కి ఈనెల 12న ఆరోతరగతిలో ప్రవేశం కల్పించింది. ప్రస్తుతం ఆన్ లైన్ క్లాసులు నడుస్తున్నాయి. 

అనిక్ పాల్ చిన్న వయసులోనే కోడింగ్, పైథాన్ లాంగ్వేజ్, ఏఐ, మెషిన్ లెర్నింగ్ వంటి కోర్సులు పూర్తి చేశాడు. ఐఐటీ మద్రాస్ నిర్వహించిన వరల్డ్ బుక్ ఆఫ్ గిన్నిస్ కార్యక్రమంలో అతి తక్కువ సమయంలో ప్రాజెక్టు సమర్పించాడు. అనిక్ పాల్ తండ్రి విజయ్ పాల్ జనగామ జిల్లా జఫర్ గఢ్ లో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. కరోనా ఆంక్షలు ఎత్తివేసిన తర్వాత తన కుమారుడిని అమెరికా పంపిస్తామని విజయ్ పాల్ తెలిపారు. 

Leave a Comment