మానవ తప్పిదమా లేదా సాంకేతిక ప్రమాదమా..!

ఈ దుర్ఘటనపై నిజ నిర్ధారణ జరగాలి : చంద్రబాబు

విశాఖలోని ఎల్జీ గ్యాస్ లీక్  దుర్ఘటనపై నిజ నిర్దారణ జరగాలని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విశాఖపట్నం ఆర్ ఆర్ వెంకటాపురం ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమలో గ్యాస్ లీకేజి దుర్ఘటన  బాధాకరమన్నారు. 

ఈ ఘటనపై సమాచారం అందగానే హుటాహుటిన స్పందించానని అన్నారు. గణబాబు ఆధ్వర్యంలో టిడిపి నాయకులు ధైర్యంగా వెళ్లి రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టడం అభినందనీయమన్నారు. జరిగింది తలచుకుంటే చాలా బాధేస్తోందన్నారు. 

సంఘటనా స్థలానికి వెళ్లడానికి తాను అనేక విధాలా  ప్రయత్నించానని,  కేంద్ర మంత్రికి, కేబినెట్ సెక్రటరీకి,  అందరినీ అనుమతులు కోరానని, అయితే ఇప్పటిదాకా రాలేదని చెప్పారు. 

స్టెరైన్ ప్రమాదం గతంలో ప్రపంచంలో ఎక్కడా జరిగిన దాఖలాలు లేవని, ఇలాంటి సమయంలో దీనిపై సమగ్రంగా అధ్యయనం చేయాల్సి ఉందని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ నిపుణులు అంతా  ఇక్కడి వచ్చి పరిశోధనలు చేయాలన్నారు. 

గ్యాస్ లాగా ఉండే స్టైరీన్ లిక్విడ్ గా మారిందని, ఈ ప్రమాదంలో అదే విడుదలైందా లేక మరో రసాయనం కలిసి గ్యాస్ రూపంలో విడుదలైందా  అనేది అధ్యయనం చేయాలన్నారు. ఈ దుర్ఘటనపై సమగ్రంగా నిశితంగా, సైంటిఫిక్ గా దర్యాప్తు జరగాలని డిమాండ్ చేశారు.  

ఇది మానవ తప్పిదమా, సాంకేతిక ప్రమాదమా, ఒకవేళ సాంకేతిక ప్రమాదం అయినా దానిని విజువలైజ్ చేయక పోయినా అది తప్పే అన్నారు. ఇప్పుడు ఆసుపత్రులలో చికిత్స పొందే వాళ్లకు రేపు మళ్లీ సమస్యలు వస్తే ఏం చేయాలో ముందే అధ్యయనం చేయాలన్నారు. దేశంలో నిపుణులైన వైద్యులు,శాస్త్రవేత్తలు వీటన్నింటిపై సమగ్రంగా విచారించాలన్నారు.  

కానీ దీనిని హ్యాండిల్ చేసిన తీరు చూస్తే చాలా బాధేస్తోందన్నారు. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి  చాలా క్యాజువల్ గా మాట్లాడారని, ఇది క్యాజువల్ గా తీసుకోవాల్సిన అంశం కాదని చెప్పారు. దీనిని ముఖ్యమంత్రి తేలిగ్గా తీసుకోవడం కరెక్ట్ కాదని తెలిపారు.  ఎల్జీ పాలిమర్స్ ప్రకటన కూడా చాలా తేలిగ్గా ఉందన్నారు. 

టిడిపి తరఫున విశాఖకు త్రిసభ్య బృందం.. 

టిడిపి తరఫున అచ్చెన్నాయుడు, చినరాజప్ప, రామానాయుడు త్రిసభ్య బృందాన్ని పంపిస్తున్నామన్నారు. అక్కడి ప్రజానీకానికి భరోసా ఇవ్వడానికి, వారిని అన్నివిధాలా ఆదుకోడానికి, అండగా ఉండటానికి పంపిస్తున్నామని తెలిపారు.  అక్కడ నుంచి ఫాక్టరీని వెంటనే తరలించాలని, దీనిపై సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయని అన్నారు. సురక్షిత ప్రాంతానికి ఈ ఫ్యాక్టరీని తరలించాలన్నారు. 

 గ్యాస్ లీకేజి టిడిపి చేసిందనే దుష్ప్రచారం చేయడం హేయం..

తామేం చెప్పినా ప్రజలు నమ్ముతారనే దురాలోచనలో వైసిపి నేతలు ఉన్నారని, గ్యాస్ లీకేజి తెలుగుదేశం పార్టీయే చేసిందని కొందరు విమర్శిస్తున్నారని చెప్పారు. ఇది సరైంది కాదన్నారు. రాజధాని విశాఖకు మార్చడం ఇష్టంలేకే టిడిపి ఈ ప్రమాదానికి పాల్పడిందని విమర్శించడం దారుణమన్నారు. 

విశాఖ గ్యాస్ లీకేజి దుర్ఘటనపై ప్రధానికి లేఖ రాస్తానని, విశాఖలో ఎయిర్ క్వాలిటి పరీక్షించాలని, ఎంత గాఢత ఉంది..? ఎంత విస్తీర్ణంలో వ్యాపించింది అధ్యయనం చేయాలని కోరుతానన్నారు.  

 

                    

 

Leave a Comment