లాక్ డౌన్ తరువాతే ఇసుక విక్రయాలు..!

రాష్ట్ర భూగర్భగనుల శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 

 సాధారణ పరిస్థితులు ఏర్పడిన తరువాత తిరిగి ఇసుక విక్రయాలు ప్రారంభమవుతాయని రాష్ట్ర భూగర్భగనుల శాఖామంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని పిఆర్ కమిషనర్ కార్యాలయంలో మైనింగ్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొత్తగా 13 జిల్లాలకు నియమితులైన జిల్లా శాండ్ ఆఫీసర్ (డిఎస్ఓ)లకు దిశానిర్ధేశం చేశారు. 

రాష్ట్రంలో వర్షాకాలం కోసం 60 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటి వరకు 30 లక్షల మెట్రిక్ టన్నులను నిల్వ చేశామన్నారు. 

నూతన ఇసుక పాలసీని మరింత పారదర్శకంగా అమలు చేయాలని ఆదేశించారు. అందుకు మైనింగ్ శాఖకు చెందిన ఎడి, డిడి స్థాయి అధికారులను డిఎస్ఓలుగా నియమించామన్నారు.  

వ్యవస్థ ప్రక్షాళనకే నూతన ఇసుక పాలసీ..

 గతంలో ఔట్ సోర్సింగ్ తో నిర్వహించిన ఈ పోస్ట్ ల్లో ఇకపై పూర్తిస్థాయి ప్రభుత్వ అధికారులు పనిచేస్తారని తెలిపారు.  మైనింగ్ శాఖలో అర్హులైన వారికి పదోన్నతులు కల్పించి, డిఎస్ఓలుగా బాధ్యతలు అప్పగించామన్నారు. 

గత ప్రభుత్వం ఉచిత ఇసుక పేరుతో దోపిడీ విధానాలకు పాల్పడిందని, ఈ అవినీతి వల్ల అధికరేట్లకు నిర్మాణదారులు ఇసుకను కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. 

 ఈ మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకే సీఎం వైఎస్ జగన్ నూతన ఇసుక పాలసీని ప్రకటించారని, రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా ఇసుక విక్రయాలు జరుపుతున్నామని పేర్కొన్నారు. ఎపిఎండిసి ద్వారా ఆన్ లైన్ లో నిర్మాణదారులకు ఇసుకను అందజేస్తున్నామని తెలిపారు. ఇసుక మాఫియాకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టామన్నారు. 

ఇసుక అక్రమ రవాణా నిరోధానికి మొబైల్ యాప్..

అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాని నిరోధించేందుకు ప్రత్యేకంగా మొబైల్ యాప్‌ తీసుకువచ్చామని, తాజాగా ఎక్కడా కూడా అక్రమాలు జరగకుండా డిఎస్ఒ లుగా మైనింగ్ అధికారులకు బాధ్యత ఇచ్చామని చెప్పారు.  కొత్తగా బాధ్యతలు చేపట్టిన డిఎస్ఓలు నిజాయితీగా వ్యవహరించాలన్నారు. 

ఇసుక రీచ్ లలో ఎవరైనా అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలిస్తే, కఠినంగా వ్యవహరించాలని సూచించారు. అధిక ఇసుక లోడింగ్, అక్రమ క్వారీయింగ్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఇసుక రవాణా కోసం జిపిఎస్ తో అనుసంధానం అయిన 13,620 వాహనాలను ఉపయోగిస్తున్నామన్నారు.  

ఎక్కడా ఇసుక కొరత లేకుండా స్టాక్ పాయింట్లను నిర్వహిస్తున్నామని,  రాష్ట్ర వ్యాప్తంగా ఎపిఎండిసి ద్వారా స్టాక్ యార్డ్ ల వద్ద 103 వేయింగ్ మెషిన్ లను ఏర్పాటు చేశామని తెలిపారు.

మొత్తం 289 సిసి కెమేరాలను ఇసుక రీచ్‌ లు, స్టాక్ పాయింట్ల వద్ద ఏర్పాటు చేశామన్నారు.ఎపిఎండిసి కమాండ్ కంట్రోల్ ద్వారా ఈ కెమేరాలతో పరిస్థితిని రియల్ టైంలో మానిటరింగ్ చేస్తున్నామన్నారు. 

389 చెక్ పోస్టలు ఏర్పాటు..

రాష్ట్ర వ్యాప్తంగా సిసి కెమేరాలతో కూడిన 389 చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేశామని,  ఇతర రాష్ట్రాలకు అక్రమంగా ఇసుక తరలిపోకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

మార్చినెల 23 వరకు రాష్ట్రంలో 100 ఓపెన్ రీచ్ లు, 43 డెస్టినేషన్ పాయింట్లు, 68 పట్టాభూముల్లో మైనింగ్ జరిగిందని,  మొత్తం 246 స్టాక్ యార్డ్ లు, శాండ్ డిపోల్లో కార్యకలాపాలు జరిగాయని తెలిపారు. 

 లాక్ డౌన్ వల్ల మార్చి 23వ తేదీ నుంచి ఇసుక విక్రయాలను నిలిపివేశామని,  రానున్న వర్షాకాలం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేయాలని సీఎం ఆదేశించారని చెప్పారు.

ఈ మేరకు ఇప్పటి వరకు 50 పాయింట్లలో 30 లక్షల టన్నుల ఇసుకను నిల్వ చేశామని,  ఈనెలాఖరు నాటికి 50 లక్షల టన్నులు నిల్వ చేయాలని ఎపిఎండిసి లక్ష్యంగా పెట్టుకుందని స్పష్టం చేశారు. 

లాక్ డౌన్ లో ఇసుక మైనింగ్ కు కేంద్ర హోంశాఖ మినహాయింపులు ఇచ్చిందని, దీనిలో భాగంగా గతనెల 1వ తేదీ నుంచి కరోనా రక్షణ సూత్రాలను పాటిస్తూ ఎపిఎండిసి ఆధ్వర్యంలో మైనింగ్ జరుగుతోందని చెప్పారు.

స్టాక్ పాయింట్లలో నిల్వ, ఉపాధిహామీ, ప్రభుత్వ పనుల కోసం ఇసుక తవ్వకాలు జరుపుతున్నామన్నారు.  లాక్ డౌన్ ఎత్తివేయగానే నిర్మాణరంగ పనులు మరింతగా ఊపందుకుంటాయని, అందుకు గానూ ముందుగానే ఇసుకను సిద్దంగా వుంచుతున్నామని స్పష్టం చేశారు. 

Leave a Comment