మీకు ఉచిత న్యాయ సహాయం ఎలా పొందాలో తెలుసా?

ప్రతి వ్యక్తికి న్యాయం జరగాలి. రాజ్యాంగంలోని 39-ఎ అధికరణం ప్రకారం ఏ వ్యక్తి కూడా ఆర్థిక కారణాల వల్ల కానీ, మరే ఇతర కారణాల వల్ల కానీ అన్యాయానికి గురి కాకూడదు. ఈ ఉద్దేశ్యంతోనే కేంద్ర, రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో ఉచిత న్యాయ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సుప్రీం కోర్టు నుంచి మండల కోర్టు వరకు ఉచిత న్యాయ సహాయ కేంద్రాలు ఉన్నాయి. పేద వారు అసహాయులు, అన్యాయానికి గురైన వారికి అన్ని కోర్టులలో వారిపై విరుద్ధంగా పెట్టబడిన కేసులకు సహాయం అందించడానికి ఉచిత న్యాయ సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

ఉచిత న్యాయ సహాయంలో అందించే సేవలు..

  • వకీలు
  • కోర్టు ఫీజు
  • టైపింగ్, జిరాక్స్, అనువాదానికి అయ్యే ఖర్చు
  • కేసుకు సంబంధించిన ఆదేశాలు లేదా నిర్ణయాలు మరియు ఇతర అత్యవసరమైన ప్రామాణిక దస్త్రాలకు అయ్యే ఖర్చు
  • సాక్షులకు సంబంధించిన అత్యవసర ఖర్చు. 

ఉచిత న్యాయ సహాయం ఎవరికీ లభిస్తుంది?

  • మహిళలకు, పిల్లలకు
  • షెడ్యూలు కులాలు, తెగల సభ్యులకు
  • శ్రామికులకు
  • సైనిక కుటుంబాల వారికి
  • జాతిహింస, వరదలు, కరువు, భూకంపాలు, పారిశ్రామిక విపత్తుల బారిన పడిన వారికి
  • సంవత్సరానికి రూ.లక్ష కన్నా ఆదాయం తక్కువ వచ్చే వారికి
  • శారీరక, మానసిక వికలాంగులకు
  • నిర్బంధంలో ఉండే వారికి
  • మహిళా గృహాలలో, బాల సదనాలలో, మానసిక చికిత్స గృహాలలో ఆశ్రయం పొందేవారికి
  • వెట్టిచాకిరి చేసే వారికి, చట్ట విరుద్ధమైన మానవ వ్యాపారానికి(లైంగిక దోపిడి మొదలైనవి) గురైన వారికి
  • దారిద్య్ర రేఖకు దిగువన ఉండే వారికి

ఉచిత న్యాయ సహాయం పొందాలంటే ఏం చేయాలి?

  • ఉచిత న్యాయ సహాయం పొందాలనుకునే వ్యక్తి సాధారణ తెల్ల కాగితం మీద తన పేరు, అడ్రస్, కులం, ఇతర వివరాలు రాయాలి.
  • కేసు వివరాలు రాయాలి.
  • దరఖాస్తుతో బాటు వయసు ధ్రువీకరణ పత్రం, ఫొటో ఉన్న ధ్రువీకరణ పత్రం జత చేసి జిల్లా ఉచిత న్యాయ సహాయ కేంద అధికారికి లేదా రాష్ట్ర ఉచిత న్యాయ సేవా అధికారికి దరఖాస్తు చేయాలి.
  • ఇతర వివరాలకు గ్రామంలో ఉన్న వయోజన విద్యా కేంద్రంలోని విలేజి కోఆర్డినేటర్లను లేదా జిల్లా ఉచిత న్యాయ సహాయ కేంద్రాన్ని సంప్రదించవచ్చు. 

లీగల్ సర్వీసెస్ అథారిటీ దరఖాస్తుదారుని యొక్క అర్హత ప్రమాణాలను పరిశీలించిన తరువాత అతనికి అనుకూలంగా వాదించేందుకు ఒక న్యాయవాదిని అందిస్తుంది. ఈ విషయంలో కేసుకు సంబంధించిన ఖర్చులను కూడా భరిస్తుంది. 

 

Leave a Comment