కీచక గురువు..నమ్మి బాధలు చెప్పుకున్న ఉపాధ్యాయురాలి అశ్లీల చిత్రాలు తీసి..!

విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు దారితప్పాడు. నమ్మి తన బాధలు చెప్పుకున్న ఓ లేడీ టీచర్ ని లోబరుచుకున్నాడు. ఆ తర్వాత ఆమె అశ్లీల చిత్రాలు తీసి బెదిరించాడు. తన కోరికలు తీర్చకపోతే ఆ చిత్రాలను బంధువులకు, స్నేహితులకు పంపిస్తానని బెదిరిస్తూ వేధించాడు. అతడి వేధింపులు తట్టుకోలేక ఆ ఉపాధ్యాయురాలు దిశ పోలీసులకు ఫిర్యాదు చేశారు.. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. 

పోలీసులు తెలిపిన వివరాల మేరకు..విశాఖపట్నం జిల్లా రావికమతం ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాలలో సూరెడ్డి మహేశ్వరరావు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. గతేడాది విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో జరిగిన ఉపాధ్యాయుల శిక్షణా తరగతులకు మహేశ్వరరావు హాజరయ్యాడు. ఈ శిక్షణా తరగతులకు జంగారెడ్డిగూడెం నుంచి ఓ లేడీ టీచర్ కూడా వచ్చారు. ఆ ఉపాధ్యాయురాలితో మహేశ్వరరావుకు పరిచయం ఏర్పడింది. ఆ పరిచయంతో వారు కొంత క్లోజ్ అయ్యారు. 

దీంతో ఆ ఉపాధ్యాయురాలు తన బాధను మహేశ్వరరావుకు చెప్పుకుంది. తనకు 2019లో పెళ్లి జరిగిందని, భర్త శారీరకంగా వేధిస్తున్నాడని తన బాధను షేర్ చేసుకుంది. ఇలా వీరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో గతేడాది సెప్టెంబర్ 27న విజయవాడ బస్టాండ్ సమీపంలో ఓ లాడ్జిలో గది అద్దెకు తీసుకున్నారు. ఇద్దరూ శారీరకంగా కలుసుకున్నారు. ఉపాధ్యాయురాలు అపస్మారక స్థితిలో ఉన్న సమయంలో ఆమె అశ్లీల చిత్రాలను తీసుకున్నాడు. తర్వాత ఆ ఫొటోలను చూపిస్తూ బెదిరించడం మొదలుపెట్టాడు. 

ఫోన్ లో రహస్య యాప్:

ఆ లేడీ టీచర్ ఫోన్ లో ఆమెకు తెలియకుండానే రహస్యంగా ఓ యాప్ ని డౌన్ లోడ్ చేశాడు. ఆ యాప్ ద్వారా ఉపాధ్యాయురాలి ఫోన్ ని తన కంట్రోల్ లోకి తీసుకున్నాడు. అశ్లీల ఫొటోలను బంధువులు, స్నేహితులకు పంపిస్తానంటూ బెదిరిస్తున్నాడు. అంతేకాదు ఆమెను వేర్వేరు ప్రాంతాలకు తీసుకెళ్లి శారీరక వాంఛ తీర్చుకునేవాడు. చివరికి అతడి వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో ఆమె ఈనెల 4న విజయవాడలోని మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహేశ్వరరావును అరెస్ట్ చేశారు.   

Leave a Comment