కృతిశెట్టితో సినిమా చేయనంటున్న విజయ్ సేతుపతి.. ఎందుకో తెలుసా?

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఉప్పెన హీరోయిన్ కృతిశెట్టితో సినిమాలను చేయనని తేల్చి చెప్పారు. ఇటీవల విడుదలైన ఉప్పెన సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో విజయ్ సేతుపతి నటన సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు. ఈ సినిమాతో ఆయన తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. శ్రుతిహాసన్ తో కలిసి ఆయన నటించిన ‘లాభం’ త్వరలో తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈసినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆయన ఓ ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. 

ఉప్పెన సినిమా తర్వాత తమిళంలో ఓ సినిమా చేశానని, అందులో కృతిశెట్టి హీరోయిన్ అయితే బావుంటుందని సినిమా యూనిట్ భావించిందని విజయ్ సేతుపతి అన్నారు. కానీ దానికి తాను ఒప్పుకోలేదన్నారు. ఆమె హీరోయిన్ అయితే ఆ సినిమా చేయనని చెప్పానని తెలిపారు. 

ఉప్పెన సినిమాలో కృతిశెట్టికి తాను తండ్రిగా చేశానని, ఇప్పుడు ఆమెతో రొమాన్స్ చేయలేనని తేల్చి చెప్పారు. అయితే ఉప్పెనలో తాను తండ్రిగా చేసిన విషయం సినిమా యూనిట్ కి తెలియదని, దీంతో మొదటగా ఆమెను హీరోయిన్ గా అనుకున్నారని అన్నారు. ఉప్పెన సినిమా క్లయిమాక్స్ షూట్ చేస్తున్నప్పుడు కృతిశెట్టి కంగారుపడిందని, దీంతో నువ్వు నా కూతురు లాంటిదానివని, ధైర్యంగా చేయమని ప్రోత్సహించానని సేతుపతి తెలిపారు. కూతురిలా భావించిన అమ్మాయితో జోడీగా నటించడం తన వల్ల కాదని, భవిష్యత్తులో కూడా ఆమెతో సినిమా చేయనని సేతుపతి వెల్లడించారు. 

Leave a Comment