ఇదేం శిక్ష సారూ.. విద్యార్థిని బిల్డింగ్ నుంచి వేలాడదీసిన ప్రిన్సిపాల్..!

సాధారణంగా పిల్లలు అల్లరి చేయడం సహజం.. పిల్లల అల్లరిని తట్టుకోలేక.. కొంచెం భయం చెప్పాలని తల్లిదండ్రులు ఉపాధ్యాయులకు చెబుతుంటారు.. అలా చెప్పినందుకు ఓ ప్రిన్సిపాల్ ఓ విద్యార్థికి చుక్కులు చూపించాడు. రెండో తరగతి విద్యార్థి కాలు పట్టుకుని కింద పడేస్తానని బిల్డింగ్ నుంచి వేలాడదీశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని మీర్జాపూర్ లో జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది..

అహ్రౌరాలోని సద్భావన శిక్షణ సంస్థాన్ జూనియర్ హైస్కూల్ లో సోనూ యాదవ్ అనే బాలుడు రెండో తరగతి చదువుతున్నాడు. గురువారం లంచ్ బ్రేక్ సమయంలో సోనూ పలువురు విద్యార్థులను కొరికినట్లు ప్రిన్సిపాల్ కు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రిన్సిపాల్ మనోజ్ విశ్వకర్మ ఆగ్రహంతో ఆ పిల్లవాడి ఒక కాలు పట్టుకుని పాఠశాల భవనంలోని మొదటి అంతస్తులోని బాల్కనీ నుంచి వేలాడదీశాడు. బిల్డింగ్ పై నుంచి కిందకు పడేస్తానని బెదిరించాడు. ఆ పిల్లవాడు ఏడుస్తూ క్షమించమని కోరడంతో ప్రిన్సిపాల్ విద్యార్థిని పైకి లాగాడు.. ప్రిన్సిపాల్ చేస్తున్న పనిని కొందరు టీచర్లు వీడియో తీశారు. 

సోనూ యాదవ్ ఇంటికెళ్లి జరిగిన విషయాన్ని తండ్రికి చెప్పాడు. దీంతో ఆ బాలుడి తండ్రి ప్రిన్సిపాల్ మనోజ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు ప్రిన్సిపాల్ ని పోలీసులు అరెస్ట్ చేశారు. జువైనల్ జస్టిస్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. దీనిపై ప్రిన్సిపాల్ మనోజ్ మాట్లాడుతూ.. ‘సోనూ చాలా అల్లరి చేసేవాడు.. పిల్లలను కొరుకుతాడు. టీచర్లను కూడా కొడతాడు. సోనూను మార్చాలని అతని తండ్రి నాకు చెప్పాడు. పిల్లవాడిని భయపెట్టడానికే అలా చేశాను.’ అని చెప్పాడు.   

 

Leave a Comment