‘వారిని ఆస్పత్రులకు కాదు..అడవులకు పంపాలి’

ఉత్తర ప్రదేశ్ కు చెందిన ఓ సీనియర్ వైద్యరాలు తబ్లిగీ జమాత్ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేశారు. వారిని ఉగ్రవాదులతో పోల్చారు. తబ్లిగీ సభ్యులను జైలుకు పంపించాలని, ఆస్పత్రులకు బదులు అడవులకు పంపించాలని వ్యాఖ్యలు చేశారు. 

కాన్పూర్ లోని గణేష్ శంకర్ విద్యార్థి మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ ఆర్తిలాల్ చందాని రెండు నెలల కింద ఒక వర్గంపై వివక్షపూరితంగా మాట్లాడిన ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొన్న వారిని గణేష్ శంకర్ విద్యార్థి మెడికల్ కాలేజీలో ఏప్రిల్ నెలలో క్వారంటైన్ లో ఉంచారు. 

చందాని ఆ వీడియోలో ఏం మాట్లాడారంటే…‘ మేము ఉగ్రవాదులకు వీఐపీ చికిత్స చేస్తున్నాము. వారి కారణంగా చాలా మంది వైద్యులు నిర్బంధంలో ఉన్నారు. ముఖ్యమంత్రి వీరిని ఆస్పత్రుల్లో చేర్పించడం ద్వారా వారిని మెప్పించే విధానాన్ని అనుసరిస్తున్నారు. వారిని జైల్లో పెట్టాలి’ అని వైద్యురాలు లాల్ చందాని తెలిపారు. ‘వీరిని ఆస్పత్రులకు కాదు అడవులకు పంపాలి..ఈ 30 కోట్ల మంది కారణంగా 100 కోట్ల మంది బాధపడుతున్నారు. వారి వల్ల ఆర్థిక అత్యవసర పరిస్థితి ఉంది’ అని వ్యాఖ్యానించారు. 

అయితే తనపై వస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు. తబ్లిగీ సోదరులపై తాను ఎలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు. తన వీడియోను మార్ఫింగ్ చేశారని చెప్పారు. కాగా, చందాని వ్యాఖ్యలపై మాజీ ఎంపీ, సీపీఐ(ఎం) నేత సుభాషిణి అలీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధం అని అన్నారు. ఈ వీడియోపై దర్యాప్తు చేయాలని, ఆమెపై చర్యలు తీసకోవాలని కోరారు. 

Leave a Comment