రైతు భరోసా కేంద్రాలు యూనిట్ గా పంటల ప్రణాళిక..

వ్యవసాయరంగంలో విప్లవాత్మక, వినూత్న నిర్ణయాలతో ప్రభుత్వం దూసుకెళ్తోంది.  తాజాగా వీటి బలోపేతం కోసం సీఎం వైయస్‌.జగన్‌ మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  వైయస్సార్‌ రైతు భరోసాకేంద్రాన్ని యూనిట్‌గా తీసుకుని…. దాని పరిధిలో ఏయే పంటలు వేయాలన్నదానిపై పంటల ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఏయే రైతు ఏ పంట వేస్తున్నారన్నదానిపై ఇ–క్రాపింగ్‌ కోసం విధివిధానాలను మరింత సమగ్రంగా తయారుచేసి, వాటిని వైయస్సార్‌ రైతు భరోసాకేంద్రాలు, గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచాలని సీఎం ఆదేశించారు. రైతులు పండించిన పంటలను విక్రయించేందుకు ఇ–ప్లాట్‌ఫాంను కూడా సిద్ధంచేయాలన్నారు. 

క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ పంటల ప్రణాళిక, ఇ– క్రాపింగ్‌ అంశాలపై కీలక సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ  వీలైనంత త్వరగా క్రాప్‌ ప్లానింగ్, ఇ– క్రాపింగ్‌పై విధి విధానాలు రూపొందించాలన్నారు. వైయస్సార్‌ రైతు భరోసాకేంద్రాన్ని యూనిట్‌గా తీసుకుని, దాని పరిధిలో ఏ పంటలు వేయాలన్నదానిపై మ్యాపింగ్‌ చేయాలన్నారు. జిల్లా, మండల స్థాయిల్లో అగ్రికల్చర్‌ సలహా బోర్డులను వెంటనే ఏర్పాటు చేయాలని సూచించారు. మార్కెటింగ్‌ చేయలేని పంటలు వేస్తే… రైతులకు నష్టం కలుగుతుందని, పంటల ప్రణాళికకు అనుగుణంగా విత్తనాలు అందుబాటులో ఉండేలా చూడాలని చెప్పారు. .

రైతులు పండించిన పంటల్లో 30 శాతం కొనుగోలు చేయడం ద్వారా మార్కెట్లో పోటీతత్వాన్ని పెంచి, రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించే ప్రయత్నాలను ప్రభుత్వం చేస్తుందని, మిగిలిన 70 శాతం పంటకు కూడా కనీస గిట్టుబాటు ధర కల్పించే ప్రయత్నాలు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. దీనికోసం ఇ–మార్కెటింగ్‌ ప్లాట్‌ఫాంను ఏర్పాటు చేయాలన్నారు. 

 

Leave a Comment