నిరుద్యోగం మరింత పెరిగే అవకాశం : సోనియా గాంధీ

లాక్ డౌన్ ప్రభావంతో దేశంలో 12 కోట్ల ఉద్యోగాలు పోయాయని, నిరుద్యోగం మరింత పెరిగే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రస్తావించారు. గురువారం దేశంలో కరోనా వైరస్ సంక్షోభం గురించి చర్చించేందుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యుసీ) సమావేశమైంది. ఈ సందర్భంగా సోనియా గాంధీ మాట్లాడుతూ ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి ప్రతి కుటుంబానికి కనీసం రూ.7,500 అందించాలని కోరారు.

ఈ సమావేశంలో సోనియా గాంధీ కరోనా వైరస్ టెస్టు రేటు మరియు వైద్య నిపుణులకు పీపీఈ కిట్లలో సరఫరా కొరత గురించి ప్రస్తావించారు. దేశంలో కరోనా పరీక్షలు తక్కువగా జరుగుతున్నాయని, కరోనా టెస్టు కిట్లు తక్కవ సరఫరా అవుతున్నాయని, వాటిలో నాణ్యత లేదని విమర్శించారు.

భారత్ మొదట్లో చైనా నుంచి కరోనా టెస్టు కిట్లను కొనుగోలు చేసిందని, ఈ కిట్లు లోపభూయిష్టంగా ఉన్నాయని పలు రాష్ట్రాలు ఫిర్యాదు చేశాయని తెలిపారు. ఈ కిట్లను ఇప్పుడు ఐసీఎంఆర్ నిలిపివేసిందని పేర్కొన్నారు. దేశం పూర్తిగా లాక్ డౌన్ కావడంతో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బ తిందని చెప్పారు. ఈ సంక్షోభం నుంచి బయటపడటానికి ప్రభుత్వం ఆహార భద్రత మరియు ఆర్థిక భద్రతా కల్పించాలన్నారు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా కరోనా వైరస్ సంక్షోభం నుంచి కోలుకోవడంపై మాట్లాడారు. లాక్ డౌన్ విజయవంతమైతే కోవిడ్-19 ను పరిష్కరించడంలో మన సామర్థ్యం నిర్ణయించబడుతుందన్నారు. కోవిడ్-19కు వ్యతిరేకంగా పోరాటం విజయవంతం కావడానికి కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య సహకారం కీలకమని తెలిపారు.

 

Leave a Comment