ఉక్రెయిన్, రష్యా యుద్ధం.. మన దేశంలో వీటిపై ప్రభావం..! 

ఉక్రెయిన్ పై రష్యా వార్ మొదలుపెట్టింది. రష్యా దళాలు తూర్పు ఉక్రెయిన్ లో బాంబుల మోత మోగిస్తున్నాయి. ఉక్రెయిన్ విషయంలో ఎవరు జోక్యం చేసుకున్న ప్రతీకారం తీర్చుకుంటామని రష్యా అధ్యక్షుడు పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికే రష్యన్ ఆర్మీ ఉక్రెయిన్ లోని ప్రధాన నగరాలపై దాడికి దిగింది.

ఈ యుద్ధం ప్రభావం మన దేశంపై కూడా పడుతుందని నిపుణులు అంటున్నారు. అయితే మన ఆర్థిక వ్యవస్థపై ఎక్కువగా ప్రభావం పడుతుందని, ముఖ్యంగా మన వంటింటిపై ఎఫెక్ట్ ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వంట నూనె రేట్లు చాలా పెరుగుతాయని, అలాగే పెట్రో ఉత్పత్తులు, వంట గ్యాస్ ధరలు కూడా పెరుగుతాయని అంటున్నారు. అలాగే ఫార్మా రంగంపైనా పెను ప్రభావం పడుతుందని చెబుతున్నారు. 

యుద్దం ఎఫెక్ట్ తో ఇవి పెరుగుతాయ్:

  • మన దేశంలో వంట నూనె వినియోగం చాలా ఎక్కువ. ముఖ్యంగా భారత్ లో పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్ ఎక్కువగా వినియోగిస్తారు. ఇందులో సన్ ఫ్లవర్ ఆయిల్ ని 90 శాతం ఉక్రెయిన్, రష్యా నుంచే దిగుమతి చేసుకుంటాం.. 2021లో భారత్ 1.89 టన్నుల సన్ ఫ్లవర్ ఆయిల్ ని దిగుమతి చేసుకుంది. ఇందులో 70 శాతం ఉక్రెయిన్, 20 శాతం రష్యా, 10 శాతం అర్జెంటీనా నుంచి వచ్చింది. ఈ రెండు దేశాల నుంచి సరఫరా ఆగిపోతే మాత్రం ఇక్కడ సామాన్యుల జేబుకు చిల్లు పడాల్సిందే..
  • ఇండియాకు వచ్చే లిక్విడ్ నేచురల్ గ్యాస్ దిగుమతుల్లో 50 శాతం ఉక్రెయిన్ నుంచే వస్తుంది. మరికొంత మొత్తం రష్యా నుంచి కూడా దిగుమతు అవుతుంది. యుద్ధం వల్ల గ్యాస్ దిగుమతి ఆగిపోవడంతో మరికొద్ది రోజుల్లోనే రేట్లు పెరిగే ఛాన్స్ ఉందని నిపుణులు అంటున్నారు. 
  • క్రూడ్ ఆయిల్ ధరలు భారీగా పెరుగుతాయి. ఉక్రెయిన్, రష్యా క్రైసిస్ మొదలైన కొద్ది నెలల్లోనే అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ ధరలు బ్యారెల్ కు 4 శాతం చొప్పున పెరిగి బ్యారెల్ రేట్ దాదాపు 100 డాలర్లకు చేరుకుంది. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైన నేపథ్యంలో క్రూడాయిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. 
  • యుద్దం వల్ల భారత ఫార్మా కంపెనీలకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. భారత్ నుంచి ఉక్రెయిన్ కి ఎక్కువ మొత్తంలో ఔషధాలు ఎగుమతి అవుతాయి. జర్మనీ, ఫ్రాన్స్ తర్వాత భారత్ నుంచే ఉక్రెయిన్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. అంతేకాదు రాన్ బాక్సీ, సన్ గ్రూప్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్ కంపెనీలకు ఉక్రెయిన్ లో ఫార్మాస్యుటికల్ తయారీ యూనిట్లు ఉన్నాయి. యుద్దం వల్ల భారత్ కి చెందిన ఈ కంపెనీలపై ప్రభావం అవకాశం ఉంది. ఆర్థికంగా ఈ కంపెనీలు సతమతమైతే దాని ప్రభావం మన దేశంలో అమ్ముడయ్యే మందులపైనా పడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 
  • ఈ యుద్ధం ఎఫెక్ట్ తో బీర్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. ఎక్కువగా యునైటెడ్ బ్రూవరీస్ కంపెనీ ఉత్పత్తులపై ప్రభావం పడుతుంది. అంటే కింగ్ ఫిషర్ బీరు ధర పెరగవచ్చు. ఎందుకంటే బీరు తయారీకి ఎక్కువగా బార్లీ గింజలను వాడుతారు. ప్రపంచంలో అత్యధికంగా బార్లీ పండించే దేశాల్లో రష్యా మొదటి స్థానంలో ఉండగా.. ఉక్రెయిన్ నాలుగో స్థానంలో ఉంది. ఈ యుద్ధం వల్ల బార్లీ సరఫరా దెబ్బతింటుంది. దీంతో బీర్ల ధరలు భారీగా పెరుగుతాయి. 

 

 

Leave a Comment