పోల్ ఎక్కారు.. జాబ్ కొట్టారు.. విద్యుత్ శాఖలో తొలిసారిగా మహిళలు..!

పురుషులతో ఏమాత్రం తీసిపోమని నిరూపిస్తున్నారు మహిళలు.. అన్ని రంగాల్లోనూ దూసుకుపోతున్నారు. అన్ని రంగాల్లోనూ పురుషులతో సమానంగా రాణిస్తున్నారు. విద్యుత్ శాఖలో అబ్బాయిలు మాత్రమే చేసే లైన్ మెన్ ఉద్యోగాన్ని తొలిసారిగా మేము కూడా చేస్తామని ముందుకొచ్చారు ఇద్దరు యువతులు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కోర్టు నిర్ణయంతో తొలిసారిగా విద్యత్ లైన్ మెన్ గా ఎంపికయ్యారు. ఆ ఇద్దరు యువతులు ఇప్పుడు మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచారు. 

 తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ సంస్థలో లైన్ మెన్ ఉద్యోగాల నియామకం కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ ఉద్యోగానికి సిద్ధిపేట జిల్లాకు చెందిన శిరీష, వరంగల్ జిల్లాకు చెందిన భారతి దరఖాస్తు చేసుకున్నారు. లైన్ మెన్ ఉద్యోగానికి పురుషులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని వీరి దరఖాస్తులను తిరస్కరించారు. 18 అడుగుల ఎత్తయిన కరెంట్ స్తంభాలు ఎక్కడం, లైన్ ఉమెన్ గా పనిచేయడం కష్టమవుతుందని టీఎస్ఎస్పీడీసీఎల్ అభిప్రాయపడింది. 

అయితే శిరీష  పట్టువదలకుండా మరో 8 మంది యువతులతో కలిసి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించింది. కోర్టు సూచనలతో అధికారులు తన నిర్ణయాన్ని మార్చుకొని దరఖాస్తు చేసుకోడానికి అనుమతించారు. అనంతరం రాత పరీక్ష నిర్వహించారు. కానీ పరీక్ష ఫలితాల విడుదలను అధికారులు నిలిపేశారు. ఈ విషయమై వారు మళ్లీ కోర్టు మెట్లు ఎక్కారు. 

దీంతో రాత పరీక్ష ఫలితాలను వెల్లడించాలని కోర్డు ఆదేశించింది. విద్యుత్ సంస్థలు రాత పరీక్ష ఫలితాలను విడుదల చేశాయి. అందులో శిరీష, భారతీ ఉత్తీర్ణత సాధించారు. కోర్డు ఆదేశాలతో రెండో దశ పరీక్షలో భాగంగా పోల్ టెస్ట్ నిర్వహించారు. ఇద్దరు యువతులు కూడా పోల్ ఎక్కారు. చివరికి విద్యుత్ శాఖలో ఉద్యోగం సాధించారు. 

Leave a Comment