ఐసోలేషన్ లో టీమిండియా క్రికెటర్లు.. రెస్టారెంట్ కు వెళ్లడమే కారణం..!

న్యూ ఇయర్ సందర్భంగా టీమ్ ను వదిలి బయట హోటల్ కు వెళ్లిన ఐదుగురు ఇండియన్ క్రికెటర్లకు బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా షాక్ ఇచ్చాయి. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఆ ఐదుగురు క్రికెటర్లను ఐసోలేషన్ లో ఉంచనున్నారు. రోహిత్ శర్మ, శుభమన్ గిల్, పృథ్వీషా, నవ్ దీప్ సైనీ, రిషబ్ పంత్ లను ఐసోలేషన్ లో ఉంచాలని బీసీసీఐ, సీఏ నిర్ణయించాయి. మిగితా జట్టు సభ్యులను కలవకుండా విడిగా ఉండాలని సూచించాయి. 

న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా ఈ ఐదుగురు క్రికెటర్లు తాము బస చేస్తున్న హోటల్ ను వదిలి బయటి రెస్టారెంట్ కు వెళ్లి భోజనం చేశారు. వీరు రెస్టారెంట్ లో గడిపిన వీడియో వైరల్ అయింది.  ఓ అభిమాని క్రికెటర్ల బిల్లును తానే చెల్లించానని, రిషబ్ పంత్ ఆ అభిమానికి హగ్ కూడా ఇచ్చాడని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. 

ఈ కారణంగా క్రికెటర్లు కరోనా నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆరోపణలు ఎదురయ్యాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన బీసీసీఐ, క్రికెట్ ఆస్ట్రేలియా ఆ ఐదుగురు క్రికెటర్లను ఐసోలేషన్ లో ఉంచినట్లు తెలిపింది. కాగా జనవరి 7న భారత్, ఆస్ట్రేలియాల మధ్య మూడో టెస్టు సిడ్నీలో జరగనుంది. 

Leave a Comment