కృష్ణా జిల్లాలో పిల్లి కరిచి ఇద్దరు మహిళలు మృతి..!

పిల్లిని ఎంతో మంది ఇష్టంగా పెంచుకుంటారు. అయితే ఈ ఇష్టం ఒక్కోసారి ప్రమాదకరంగా మారుతుంది. ఎందుకంటే పిల్లి కరిస్తే చాలా ప్రమాదకరం.. తాజాగా పిల్లి కరిచి ఇద్దరు మహిళలు మృతి చెందారు. ఇద్దరు మహిళలకు రేబిస్ వ్యాధి సోకడంతో ఇద్దరూ మరణించారు. ఈ ఘటన కృష్ణా జిల్లా మొవ్వ మండలం వేములమడలో చోటుచేసుకుంది.  

వేములమడ ఎస్సీ కాలనీకి చెందిన కమల(64), అదే కాలనీకి చెందిన నాగమణి(43)లను రెండు నెలల క్రితం పిల్లి కరిచింది. వైద్యుల సలహా మేరకు ఇద్దరూ టీటీ ఇంజక్షన్లు చేయించుకున్నారు. గాయాలు తగ్గడానికి మందులు కూడా వాడారు. కొద్ది రోజులకు గాయాల నుంచి ఉపశమనం కలిగింది. దీంతో యథావిధిగా తమ పనులు చేసుకుంటున్నారు. 

అయితే నాలుగు రోజల క్రితం కమల, నాగమణి ఇద్దరికీ ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దీంతో కమల మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో, నాగమణి శుక్రవారం విజయవాడలోని కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు. చికిత్స తీసుకున్నప్పటికీ వీరి ఆరోగ్యం మెరుగుపడలేదు. నాగమణి శనివారం తెల్లవారుజామున మృతి చెందగా.. అందేరోజు ఉదయం 10 గంటలకు కమల ప్రాణాలు కోల్పోయింది. 

మృతి చెందిన ఇద్దరు మహిళలకు రేబిస్ వ్యాధి సోకినట్లు వైద్యాధికారులుతెలిపారు. సకాలంలో వైద్య సేవలు అందకపోవడంతో శరీరం విషతుల్యమైందన్నారు. కాగా వారిద్దరిని కరిచిన పిల్లకి కుక్క కరిచిందని, దీంతో ఆ పిల్లి మరణించిందని స్థానికులు చెబుతున్నారు. పిల్లి, కుక్క తదితర జంతువులు కరిస్తే.. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యం చేయించుకోవాలని వైద్యులు చెబుతున్నారు.  

     

 

Leave a Comment