ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు.. ఏ జిల్లాల్లో అంటే..?

ఆంధ్రప్రదేశ్ లో రానున్న మూడు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తమిళనాడు, శ్రీలంక పరిసరాల్లో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ దిశగా కదులుతూ అరేబియా సముద్రం వైపు ప్రయాణిస్తోంది. ఇది క్రమంగా ఉత్తర దిశగా ప్రయాణిస్తూ రాగల 36 గంటల్లో మరింత బలపడే అవకాశం ఉంది. అల్పపీడనానికి అనుబంధంగా ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో కొనసాగుతోంది. మరోవైపు కొమరిన్ శ్రీలకం పరిసర ప్రాంతాల మీదుగా మధ్య బంగాళాఖాతం నుంచి దక్షిన కోస్తాంధ్ర తీరం వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది.  

అల్పపీడనం ప్రభావంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది. బుధవారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయగోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు లేదా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మిగిలిన జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. 4,5 తేదీల్లో కోస్తా, రాయలసీమల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి.   

Leave a Comment