జగన్ సర్కార్ కీలక నిర్ణయం

క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారికి రూ.2వేలు

క్వారంటైన్ పూర్తి చేసుకొని ఇంటి పంపేటప్పుడు పేదలను గుర్తించి రూ.2వేలు ఇవ్వాలని సీఎం జగన్ ఆదేశించారు. కోవిడ్ -19 నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ కేసులు అధికంగా ఉన్న జిల్లాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. కచ్చితంగా భౌతిక దూరం పాటించేలా నిబంధనలు అమలు చేయాలని సీఎం స్పష్టం చేశారు. 

క్వారంటైన్ పూర్తి చేసుకున్న వారికి పౌష్టికాహారం తీసుకోవాలని సూచించాలన్నారు. లేదంటే సమస్య మళ్లీ మొదటికి వచ్చే ప్రమాదం ఉంటుందన్నారు. అన్ని రోజులు క్వారంటైన్ లో పెట్టి ఇంటికి పంపితే పస్తు ఉండే పరిస్థితి ఉండకూడదన్నారు. క్వారంటైన్లలో సదుపాయాలపై నిరంతరం దృష్టిపెట్టాలన్నారు. 

స్వయం సహాయక సంఘాలకు మాస్కుల తయారీ..

మాస్క్‌ల తయారీని స్వయం సహాయక సంఘాలకు అప్పగించాలని సీఎం జగన్ ఆదేశించారు. మొదట హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో మాస్క్‌లను పంపిణీ చేయాలన్నారు. ప్రతి మనిషికి మూడు మాస్క్‌ల చొప్పున ఇవ్వాలన్నారు. రేపటి నుంచి డెలివరీ ప్రారంభిస్తామని అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. రెండు మూడు రోజుల తర్వాత డెలివరీని పెంచుతామన్నారు. 

సచివాలయాల్లో రైతు భరోసా లబ్ధిదారుల జాబితా..

రైతు భరోసా లబ్ధిదారుల జాబితాలను గ్రామ సచివాలయాల్లో ఉంచాలని సీఎం జగన్ తెలిపారు. అలాగే మత్స్యకార భరోసా లబ్ధిదారుల జాబితాను గ్రామ సచివాలయాల్లో పెట్టాలన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో ఇంటర్నెట్‌ కనెక్షన్‌ ఉండేలా చూసుకోవాలని, కియోస్క్‌లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆర్బీకేలను కేంద్రంగా చేసుకుని మార్కెటింగ్‌ కార్యకలాపాలు నిర్వహించాలన్నారు. ఇతర రాష్ట్రాలకు చేపల ఎగుమతికి అవాంతరాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 

Leave a Comment