ఇంగ్లీష్ మీడియంపై రాజీపడే ప్రసక్తి లేదు..

చంద్రబాబు బుర్ర ఎల్లో వైరస్ తో నిండింది

మంత్రి అనిల్ కుమార్ యాదవ్

ప్రపంచమంతా కరోనా తో అల్లాడుతుంటే చంద్రబాబు బుర్ర మాత్రం ఎల్లో వైరస్ తో  నిండిపోయిందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.  రాష్ట్రంలో కోవిడ్ -19 కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారన్నారు. ఓ జాతీయ న్యూస్ ఛానల్ భారతదేశంలో ఏపీ మోస్ట్ సక్సెస్ ఫుల్ స్టేట్ ఇన్ లాక్ డౌన్ అని పేర్కొందని అని తెలిపారు. లాక్డౌన్ లో కేసులు తగ్గించడంలోగాని, జాగ్రత్తలు తీసుకోవడంలోగాని మొట్టమొదటి స్థానం ఏపీకి వచ్చిందంటే అది సీఎం జగన్ ముందు చూపే కారణమన్నారు. 

వాస్తవానికి చంద్రబాబు నాయుడులాగా అబద్ధాలు చెప్పే మనస్తత్వం జగన్ కు లేదన్నారు. రాష్ట్రం అంతా కరోనా వల్ల ఇబ్బందుల్లో ఉంటే ప్రతిపక్షనేత చంద్రబాబు మాత్రం తన పంధా వీడటం లేదన్నారు. పక్క రాష్ట్రంలో కూర్చొని వారి చెంచాలతో అబద్దపు ప్రచారం, తప్పుడు ప్రచారాలు, చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కనీసం చంద్రబాబు కూడా సహాయం చేయడం లేదని, టిడిపి నేతలు రాష్ట్రంలో  ఎక్కడైనా ప్రజలకు సహాయం చేస్తున్నారా అని ప్రశ్నించారు. చివరకు ఆయన కొడుకు కూడా రాష్ట్రంలో లేడని, కాని తప్పుడు రాజకీయాలు చూస్తూ శునకానందం పొందుతున్నాడని చెప్పారు. 

హైకోర్టు ఇంగ్లీషు మీడియంపై ఆదేశాలు ఇస్తే దానికి ఏదో సంబరపడిపోతున్నారన్నారు. దీనిపై ఎల్లో మీడియా నానా హడావుడి చేస్తుందన్నారు. తమ విధానం ప్రతి ఒక్కరికీ మంచి విద్య అందించడమేనని తెలిపారు. బడగు బలహీన వర్గాలు, మైనారిటీల పిల్లలు కూడా పోటీ ప్రపంచంలో ఉన్నతస్దానాలకు ఎదిగే విధంగా  చేయాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 

ఇంగ్లీష్ మీడియం మీ పిల్లలకేనా..

ఇంగ్లీషు మీడియంపై ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే వీరికి తెలుగంటే ఇష్టం లేద అని మాట్లాడుతున్నారు. ఇంగ్లీషు మీడియం టీడీపీ నేతల బిడ్డలకేనా..పేద వర్గాలైన ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీల పిల్లలు ఇంగ్లీషు మీడియం చదువుకుని ఉన్నత స్థాయికి పోకూడదా అని ప్రశ్నించారు.  ‘మీ బిడ్డలు మాత్రం అమెరికాలో చదవాలి, పేదవాడి బిడ్డలు మాత్రం తెలుగు మీడియంలో చదివి ఇక్కడే మగ్గిపోయి ఉండాలా…మీకు ఒక న్యాయం…పేదవాడికి ఒక న్యాయమా. అని ప్రశ్నించారు. చంద్రబాబు ఆయన బినామిలు నారాయణ, చైతన్య సంస్ధలను బతికించుకునేందుకు ఈ విద్యావ్యవస్ధలో ప్రైవేటీకరణ పెంచి గవర్నమెంట్ విద్యను నాశనం చేశారన్నారు. 

వెనక్కు పోయేది లేదు..

ఇంగ్లీషు మీడియం విషయంలో ప్రభుత్వం వెనకకు పోయేది లేదన్నారు. ఖచ్చితంగా ప్రతి బిడ్డను ఒక మంచి స్ధాయిలో ఉండాలి అనే ఆలోచనతో ముఖ్యమంత్రి జగన్ ముందుకు వెళ్తున్నారన్నారు. రాజీ ప్రశ్నేలేదన్నారు. 

 

Leave a Comment