థర్డ్ వేవ్ ముప్పు.. రోజుకు 6 లక్షల కేసులు..!

గత కొద్ది వారాలుగా దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం నిలకడగా కొనసాగుతోంది. రోజువారి కేసులు, మరణాలు స్వల్పంగా హెచ్చు తగ్గుదలతో ఒక స్థాయిలో నమోదవుతున్నాయి. అయితే మహమ్మారి థర్డ్ వేవ్ తప్పదని, త్వరలోనే అది వ్యాప్తిచెందే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. 

థర్డ్ వేవ్ అక్టోబర్ నాటికి గరిష్టస్థాయికి చేరవచ్చని, పెద్దలతో పాటు పిల్లలపైనా తీవ్ర ప్రభావం చూపుతుందని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్(ఎన్ఐడీఎం) కమిటీ పేర్కొంది. వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని నిపుణుల కమిటీ సూచించింది. 

కమిటీ సూచనలు ఇవే..

  • ఒకవేళ చిన్నారులు భారీగా కరోనా బారినపడి ఆస్పత్రుల్లో చేరే పరిస్థితి తలెత్తితే.. వైద్య సిబ్బంది, వెంటిలేటర్లు, అంబులెన్సులు వంటి వైద్య సేవలు అవసరానికి తగ్గట్టుగా అందుబాటులో లేవు. చికిత్స సమయంలో వైరస్ సోకిన పిల్లలతో ఉండే సంరక్షకులు సురక్షితంగా ఉండేలా కోవిడ్ వార్డుల నిర్మాణం ఉండాలి. 
  • ప్రత్యేక అవసరాలున్న పిల్లలు, ఇతర వ్యాధులతో ఇబ్బందులు పడుతున్న చిన్నారులకు తక్షణమే వ్యాక్సిన్ ఇవ్వాలి. ప్రతి 100 పాజిటివ్ కేసుల్లో 23 మంది ఆస్పత్రిలో వైద్య సేవలు అందేలా సన్నాహాలు చేయాలని నీతి అయోగ్ ఇదివరకే ప్రభుత్వానికి సూచించింది. 
  • దేశంలో ఇప్పటి వరకు కేవలం 7.6 శాతం(10.4కోట్లు) మందికి మాత్రమే రెండు డోసుల టీకా ఇచ్చారు. వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలి. లేదంటే రోజుకు ఆరు లక్షల కేసులు చూడాల్సి వస్తుంది. 
  • అక్టోబర్ లో థర్డ్ వేవ్ గరిష్టానికి చేరితే రోజుకు 3.2 లక్షల కేసులు నమోదవుతాయి. లేదంటే మరింత వైవిధ్య భరిత వేరియంట్లతో సెప్టెంబర్ లోనే మూడో వేవ్ వస్తే రోజుకు 5 లక్షల కేసులు నమోదయ్యే అవకాశం ఉంది. ఒకవేళ అక్టోబర్ చివర్లో వైరస్ వ్యాప్తి పెరిగితే రోజుకు గరిష్టంగా 2 లక్షల కేసులు నమోదవుతాయి. 
  • పిల్లలు తీవ్రంగా ప్రభావితం అవుతారనేందుకు కచ్చితమైన డేటా లేదు. ఏదేమైనా వైరస్ అభివృద్ధి చెందుతున్నందున చిన్నారులకు టీకా రానందున థర్డ్ వేవ్ సవాల్ విసురుతుంది. 

Leave a Comment