భారత్ లో అక్టోబర్ లో థర్డ్ వేవ్.. పిల్లలపైనే అధిక ప్రభావం : కేంద్ర హోంశాఖ

కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో పనిచేసే నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్(NIDM) ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ కరోనా థర్డ్ వేవ్ పై హెచ్చరికలు జారీ చేసింది. కరోనా థర్డ్ వేవ్ అక్టోబర్ లో పీక్ స్టేజ్ కు చేరుతుందని, ఇది పెద్దలతో పాటు పిల్లలపైనా ప్రభావం చూపనుందని ఈ కమిటీ స్పష్టం చేసింది. ఈ రిపోర్టును ప్రధాన మంత్రి కార్యాలయానికి సమర్పించింది. 

దేశంలో థర్డ్ వేవ్ ను దృష్టిలో పెట్టుకుని మెరుగైన వైద్యం కోసం సన్నద్ధం కావాలని ఎన్ఐడీఎం సూచించింది. థర్డ్ వేవ్ సమయంలో ప్రస్తుతం ఉన్న వైద్య సదుపాయాలు సరిపోవని నివేదికలో వెల్లడించింది. ఇక చిన్న పిల్లలకు వైద్యం కోసం సిబ్బందిని పెంచాలని సూచించింది.

ఇక దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న పిల్లలు, దివ్యాంగులకు వ్యాక్సినేషన్ ప్రక్రియకు ప్రాధాన్యత ఇవ్వాలని ఈ కమిటీ చెప్పింది. అయితే వైరస్ వల్ల పిల్లలపై మరీ ఎక్కువ ప్రభావం పడకపోయినా.. వారు ఇతరుకు వ్యాపింపజేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని కమిటీ తెలిపింది. 

దేశంలో ఆరోగ్య కేంద్రాల్లో 82 శాతం శిశు వైద్యుల కొరత ఉండగా.. దేశవ్యాప్తంగా కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో 63 శాతం ఖాళీలు ఉన్నట్లు ఎన్ఐడీఎం నివేదిక తెలిపింది. థర్డ్ వేవ్ ముప్పును దృష్టిలో పెట్టుకుని వైద్యుల కొరత, ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది.

 

Leave a Comment