కలెక్టర్ ఇంట్లో చోరీకి వెళ్లి.. లేఖ రాసిన దొంగలు.. ఏం రాశారంటే..!

సాధారణంగా దొంగలు ఇంట్లో చొరబడి దొరికినకాడికి దోచుకెళ్తారు.. ఇంట్లో ఏమీ దొరక్కపోతే నిరాశతో వెళ్లిపోతారు. కానీ ఈ దొంగలు మాత్రం ఏకంగా ఓ డిప్యూటీ కలెక్టర్ కే లేఖ రాశారు.. అది కూడా ఆయన ఇంటికే దొంగతనానికి వెళ్లీ.. ఈ ఆశ్చర్యకరమైన ఘటన మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ దొంగలు రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వివరాల మేరకు.. మధ్య ప్రదేశ్ రాజధాని భోపాల్ సమీపంలో దేవాస్ సివిల్ లైన్స్ ప్రాంతంలో డిప్యూటీ కలెక్టర్ త్రిలోచన్ గౌర్ అధికారిక నివాసంలో ఉంటున్నారు. ఈ మధ్య ఆయన ఓ పర్యటనకు వెళ్లాల్సి వచ్చింది. దీంతో ఇంటికి తాళం వేసి వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉండటంతో ఇంట్లో దొంగలు పడ్డారు. అయితే పర్యటన నుంచి తిరిగి వచ్చిన డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉండటాన్ని చూసి షాక్ అయ్యారు.  ఇంట్లో ఉన్న రూ.30 వేల నగదు, వెండి ఆభరణాలు కనిపించకపోవడంతో త్రిలోచన్ గౌర్ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఇంటిని పరిశీలించారు. వారికి ఎలాంటి అనవాళ్లు దొరకలేదు. అయితే ఇంట్లో ఓ లేఖ మాత్రం దొరికింది. అది దొంగతనానికి వచ్చిన దొంగలు రాసిన లేఖ..‘ఇంట్లో డబ్బులు లేకపోతే తాళం ఎందుకు వేశారు.’ అని డిప్యూటీ కలెక్టర్ ను ప్రశ్నిస్తూ దొంగలు లేఖ రాశారు. ఈ లేఖ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

 

 

 

Leave a Comment