వీళ్లిద్దరూ ఇంట్లో కూర్చొని రూ.62 కోట్లు సంపాదించారు.. !

ఈరోజుల్లో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను ఫాలో అవుతున్నారు. అయితే ఈ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొన్ని లింకులు కనిపిస్తుంటాయి. లింక్ క్లిక్ చేస్తే ఫ్రీ రీచార్జ్ అని, గిఫ్ అని, లేద సులువుగా డబ్బు సంపాదించవచ్చని లింకులు చక్కర్లు కొడుతుంటాయి. ఈ లింక్స్ ని వేరేవారికి ఫార్వర్డ్ చేస్తే కమిషన్ వస్తుందని నమ్మిస్తారు. ఇలాంటి లింక్స్ గానీ క్లిక్ చేస్తే మీరు నట్టేట మునిగినట్లే.. అలాంటి చీటింగ్ యాప్స్, లింకుల ద్వారా ఏకంగా రూ.62 కోట్లు కొల్లగొట్టారు ఇద్దరు కేటుగాళ్లు.. ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా పోలీసులు ఈ కేటుగాళ్ల ఆటను కట్టించారు.. 

వివరాల మేరకు.. కడప జిల్లాలోని కడప వన్ టౌన్, చాపాడు, మైదుకూరు, దువ్వూరులలో ఆన్ లైన్ యాప్స్, లింక్స్ ద్వారా మోసపోయామని కొందరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులను పోలీసులు ఓ ఛాలెంజింగ్ గా తీసుకుని దర్యాప్తు చేశారు. దాదాపు 100 మందిని ఓ ముఠా రూ.3 కోట్ల మేర టోకరా వేసినట్లు గుర్తించారు. మేకింగ్ మనీ, ఆర్సీసీ, కొన్ని ఇతర యాప్ ల పేరుతో బల్క్ ఎస్ఎంఎస్ లను పంపుతున్న ముఠా.. అమాయకులను, మధ్య తరగతి వారిని బుట్టలో వేసుకుంది. ఎస్ఎంఎస్ ద్వారా వచ్చిన లింక్ క్లిక్ చేసి చన్ని మొత్తంలో పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించారు. 

ఇందులో రిజిస్టరై యాప్ ఓపెన్ చేసిన తర్వాత ట్రేడింగ్ టాస్క్ పేరుతో వస్తువులను ఆన్ లైన్ లో కొనేందుకు పెట్టుబడి పెట్టాలని చెబుతారు. టాస్క్ లో పాల్గొని కమిషన్ రూపంలో అధిక డబ్బులు సంసాదించవచ్చనే ఆశతో చాలా పెట్టుబడి పెడతారు. ఇక చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టిన వారికి కొంత కమిషన్ పంపిస్తారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడితే డబ్బులు ఇంకా ఎక్కువ వస్తాయని నమ్మిస్తారు. ఇలా వారి సన్నిహితులతోనూ, తెలిసిన వారికి చెప్పి ఇందులో చేర్పించాలని చెబుతారు. ఇలా పెట్టుబడి పెట్టిన వారు వర్చువల్ పేమెంట్ అడ్రస్ ద్వారా డబ్బును సైబర్ నేరగాళ్ల ఖాతాలకు డిపాజిట్ చేయించుకుంటారు. 

ఈకేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు కడప జిల్లా పోలీసులు తెలిపారు. వారికి సంబంధించిన 23 బ్యాంకు ఖాతాల్లోని రూ.62.5 కోట్ల మొత్తాన్ని ఫ్రీజ్ చేసినట్లు పేర్కొన్నారు. నిందితులు తమిళనాడులోని నామక్కల్ కు చెందిన గోకుల్ వేందన్(28), ఈరోడ్ కుచెందిన మురుగానందన్(50)గా గుర్తించారు. వీరు ఉత్తరాఖండ్ లోనూ ఇదే తరహా మోసాలకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. 

Leave a Comment