జగన్ ను మించిన నాటకాల రాయుడు మరొకరు లేరు : చంద్రబాబు

వైసీపీ వచ్చాక దేవాలయాలపై దాడులు పెరగడం బాధాకరమని టీడీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తెలిపారు. మంగళవారం టీడీపీ సీనియర్ నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. టీడీపీ హయాంలో రాష్ట్రంలో మత సామరస్యాన్ని కాపాడామని, ఎక్కడా ఎటువంటి దుర్ఘటనలు లేకుండా అన్నిమతాలను గౌరవించామని చంద్రబాబు వ్యాఖ్యానించారు. వైసీపీ వచ్చాక దేవాలయాల్లో, ప్రార్ధనా మందిరాల్లో అకృత్యాలు పెరిగిపోయాయన్నారు. 

వైసీపీ ప్రభుత్వ ఉదాసీనత వల్ల ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారన్నారు. 10 రోజుల్లోనే రాష్ట్రంలో లక్ష కరోనా కేసులు నమోదయ్యాయన్నారు. మీటర్ల పేరుతో రైతుల మెడకు ఉరితాళ్లు తగిలించడం హేయమన్నారు. వైసీపీ దుర్మార్గాలను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. 

పారిశ్రామిక వేత్తలను  బెదిరించి, వైసిపి గవర్నమెంట్ టెర్రరిజం ద్వారా రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చిందన్నారు. జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రంలో దళితులపై దాడులు జరగని రోజు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళితులపై వైసీపీ దమనకాండ గురించి దేశవ్యాప్తంగా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. 

వైసీపీ ప్రభుత్వ పథకాలన్నీ కొత్త సీసాలో పాత సారా వంటివే అని ఎద్దేవ చేశారు. టీడీపీ ప్రభుత్వ పథకాలకు తండ్రీకొడుకుల పేర్లు తగిలిస్తున్నారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డిని మించిన నాటకాల రాయుడు మరొకరు లేరని విమర్శించారు. నోరు తెరిస్తే అబద్దం, రోజుకో నాటకం చేస్తున్నారని విమర్శలు చేశారు. వైసీపీ అరాచకాలను ప్రజల్లో తీసుకెళ్లాలన్నారు. ‘పసుపు చైతన్యం’ 100 రోజుల కార్యక్రమాలు విజయవంతం చేయాలన్నారు.

 

Leave a Comment